ముక్కోటి మురిసేనా?
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వచ్చే నెల 20 నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రతీరోజు స్వామి వారి అవతారాలతో పాటు 29న సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం, 30న ఉదయం ఉత్తర ద్వార దర్శనం జరగనున్నాయి. అయితే ముక్కోటికి వచ్చే భక్త కోటి మురిసేలా ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. – భద్రాచలం
గతేడాది అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
● ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయాలంటున్న భక్తులు ● కరకట్ట వెంట ఆహ్లాదం, ఆధ్యాత్మికత పెంచాలని వేడుకోలు ● డిసెంబర్ 20 నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభం
ప్రత్యేక ఆకర్షణగా జలవిహారం..
ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా గోదావరిలో జరిగే స్వామివారి జల విహారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీనిని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. తెప్పోత్సవంగా పిలిచే ఈ వేడుకలో సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామి మూడుమార్లు గోదావరిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులు అబ్బురపరుస్తాయి. అయితే గత ఏడాది దీంతో పాటు కలెక్టర్ జితేష్ వి పాటిల్.. గోదావరి తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పలువురు కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఇప్పించారు. స్వామివారి తెప్పోత్సవం ముగిశాక కూడా ప్రదర్శనలు సాగడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. అంతేకాక యువత, భక్తులను ఆకర్షించేలా సెల్ఫీ పాయింట్ ఏర్పాటుచేయగా ఈ రెండు కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఈ ఏడాది సైతం ఇలాంటి వేడుకలు పునరావృతం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇక కరకట్ట వెంట భక్తులు విడిది చేసి ఉత్సవాన్ని వీక్షించేలా ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ‘ఏరు ఉత్సవం’ కొద్ది రోజులకే ఆదరణ కోల్పోయింది. దీంతో ఈ విడిదిని పూర్తిగా తీసివేశారు.
సెక్టార్లు ఏర్పాటుచేస్తే సరి..
గోదావరి తీరంలో జరిగే తెప్పోత్సవాన్ని ఆద్యంతం వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. వీవీఐపీలు, వీఐపీలకు మాత్రమే సెక్టార్ల విభజన జరుగుతుండగా సామాన్య భక్తులు గోదావరి మెట్లు, కరకట్టపైనే నిల్చుని వీక్షించాల్సి వస్తోంది. తమకు సైతం దర్శనభాగ్యం కలిగేలా సెక్టార్ల విభజన చేయాలని అంటున్నారు. అదేవిధంగా ఎల్‌ఈడీ తెరలు సైతం తగినన్ని ఏర్పాటుచేయాలని, కరకట్టతో పాటు పట్టణంలోని ముఖ్య కూడళ్లలో, ఆర్టీసీ బస్టాంట్ వంటి సెంటర్లలో ఏర్పాటు చేయాలంటున్నారు. ఇక వృద్ధులు గోదావరి తీరానికి సులువుగా చేరేలా మెట్లవెంట రెయిలింగ్ ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. గతేడాది జరిగిన చిన్నచిన్న లోటుపాట్లను సరి చేసి భక్తులు మురిసేలా ముక్కోటి ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.
20 నుంచి అధ్యయనోత్సవాలు..
శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి జనవరి 12 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఇందులో పగల్‌పత్తు ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు వివిధ అవతారాల్లో స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. 29న సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం, 30న తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం ఉంటాయి. 30 నుంచి జనవరి 12 వరకు రాపత్తు సేవలు, జనవరి 16న బేడా మండపంలో విశ్వరూప సేవ భక్తులను కనువిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా డిసెంబర్ 20 నుంచి 30 నుంచి నిత్యకల్యాణాలు నిలిపివేస్తామని, డిసెంబర్ 16 నుంచి జనవరి 16 వరకు సంధ్యా హారతి ఉంటుందని వైదిక పెద్దలు, ఈఓ దామోదర్‌రావు వెల్లడించారు.
ముక్కోటి మురిసేనా?


