శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూల విరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతం అభిషేకాలు చేశారు. అలాగే, స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం జరిపించారు. అంతేకాక పల్లకీ సేవ చేశారు. ఈఓ కె.జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సిబ్బందిపాల్గొన్నారు.
కుర్నవల్లి వాసికి
ఉత్తమ రైతు పురస్కారం
తల్లాడ: తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన అయిలూరి కోటిరెడ్డికి ఉత్తమ రైతు పురస్కారం లభించింది. రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధన స్థానంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయనను శాస్త్రవేత్తలు, అధికారులు సన్మానించి పురస్కారం అందజేశారు. నేరుగా విత్తే విధానంలో వరి సాగు చేయడంతో పాటు నూతన వంగడాలు, ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంబిస్తుండడంతో ఆయనను పురస్కారానికి ఎంపిక చేశారు. ఈమేరకు కోటిరెడ్డిని వైరా కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ టి.సుచరితాదేవి తదితరులు శనివారం సన్మానించారు.
ధాన్యం కేంద్రాల్లో సరిపడా గన్నీ సంచులు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు కేంద్రాలకు 9,71,500 బ్యాగ్‌లు సమకూర్చగా, ఇంకా అవసరమైతే ప్రతిపాదనలు అందిన 48 గంటల్లోగా సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. అంతేకాక ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, గన్నీ సంచులతో పాటు టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. కాగా, రైతుల ఇంటి వద్దకు గన్నీ సంచులు ఇవ్వవద్దని సిబ్బందిని ఆదేశించామని అదనపు కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
14న జిల్లా ఖో–ఖో జట్టు ఎంపిక
కల్లూరు: పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యాన ఈనెల 14న జిల్లా స్థాయి బాలుర ఖో–ఖో జట్టును ఎంపిక చేయనున్నారు. కల్లూరులోని మినీ స్టేడియంలో జరిగే అండర్–14 ఎంపిక పోటీలకు ప్రతీ మండలం నుంచి 12మంది క్రీడాకారులు హాజరుకావాలని కన్వీనర్ పి.నివేదిత, నిర్వహణ కార్యదర్శులు బోడా భీమా, పసుపులేటి వీర రాఘవయ్య, రాములు సూచించారు. 1–1–2012 తర్వాత జన్మించి 6నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న వారే అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు అర్హత పత్రం, స్టడీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో హాజరుకావాలని వెల్లడించారు.
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం


