శుభ్రత.. రక్షణ
షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు
● ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేక క్యాంపెయిన్ ● వచ్చేనెల 5నాటికి పూర్తి చేసేలా కసరత్తు
నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు విద్యాశాఖ ‘క్లీన్ అండ్ సేఫ్ – 5.0’ పేరిట కార్యక్రమం చేపడుతోంది. ఇందులో భాగంగా పాఠశాలల ప్రాంగణాలు, తరగతి, వంట గదులు, టాయిలెట్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చర్యలు చేపడుతారు. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా చేపట్టే ఈ పనులను డిసెంబర్ 5వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. దీంతో జిల్లాలోని 1,600 ప్రభుత్వ పాఠశాలల్లో అమలుకు విద్యాశాఖాధికారులు ప్రణాళిక రూపొందించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, ఎస్‌ఎంసీల బాధ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, దాతలనే కాక స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయనున్నారు.
ఏమేం చేస్తారంటే...
ప్రతీ పాఠశాలలను శుభ్రంగా, ఆకర్షణీయంగానే కాక సురక్షితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో క్యాంపెయిన్ రూపొందించారు. తొలుత పాత, ప్రమాదకర నిర్మాణాలను గుర్తించాలని ఎంఈఓలను ఆదేశించారు. ఆపై తరగతి గదులు, ల్యాబ్‌లు, కార్యాలయ గదులు, సెప్టిక్ ట్యాంకులు, టాయిలెట్లు, తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయిస్తారు. అంతేకాక పాత ఫర్నిచర్, పాడైన వస్తువులు, ప్లాస్టిక్, మెటల్ వ్యర్థాలను వేరు చేయాలి. ఎంఈఓ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ శాఖ ఉద్యోగులతో కూడిన కమిటీ పర్యవేక్షించాలి. ఎట్టి పరిస్థితుల్లో దహనం చేయొద్దనే నిబంధన విధించారు. అంతేకాక మధ్యాహ్న భోజనానికి ముందు విద్యార్థులు చేతులు కడుక్కునేలా అవగాహన కల్పిస్తారు. అలాగే, చెదలు, దోమలు లేకుండా చూ స్తూ నీడనిచ్చే చెట్లు, పూల మొక్కలు నాటాలి. పాఠశాల గోడలపై ఆరోగ్య సందేశాలు రాయిస్తారు.
భద్రత కోసం...
పాఠశాలల విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదాల బారిన పడకుండా ఈ క్యాంపెయిన్‌లో పనులు చేపడుతారు. విద్యుత్ వైర్లు, స్విచ్‌లను తనిఖీ చేసి దెబ్బ తింటే మార్పిస్తారు. అలాగే, బెంచీలు, టేబుళ్లు, బోర్డులు కూడా పకడ్బందీగా బిగిస్తారు. ఇక విద్యార్థులు వంట గదుల్లోకి రాకుండా పర్యవేక్షించాలి. ఆపై ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను తనిఖీ చేసి లోపాలు ఉంటే సరిచేయించాలి. ఈ పనులు పూర్తయ్యాక ఆస్పత్రి, అగ్నిమాపకశాఖ, పోలీసు శాఖ ఉద్యోగుల ఫోన్ నంబర్లు గోడలపై రాయిస్తారు.
ప్రతీ ప్రభుత్వ పాఠశాలను సురక్షితంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా క్యాంపెయిన్ నిర్వహిస్తాం. తద్వారా ఆరోగ్యకరమైన, అభ్యసన వాతావరణం ఏర్పడుతుంది. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా చేపట్టే ఈ కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించేలా పర్యవేక్షిస్తున్నాం.
– ప్రవీణ్‌కుమార్, విద్యాశాఖ సీఎంఓ
శుభ్రత.. రక్షణ


