ఏజెన్సీలో జోష్..
● ఏడూళ్ల బయ్యారంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ● పది ఉమ్మడి జిల్లాల నుంచి తలపడుతున్న జట్లు ● హోరాహోరీగా సాగిన తొలిరోజు మ్యాచ్‌లు
పినపాక: మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో రాష్ట్రస్థాయి అండర్ –17 కబడ్డీ పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చిన 20 బాలబాలికల జట్లు ఈ పోటీల్లో సత్తా చాటనున్నాయి. క్రీడాకారుల వివరాలు, వయసు ధ్రువీకరణ వంటి ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆదివాసీ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని జిల్లాల క్రీడాకారులతో ఏజెన్సీ ప్రాంతంలో జోష్ నిండింది.
రాష్ట్రస్థాయి పోటీలు గర్వకారణం..
పినపాకలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించడం జిల్లా కు గర్వకారణమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గ్రామీణ విద్యార్థులు, యువ క్రీడాకారులు ఇలాంటి వేదిక ల ద్వారా తమ ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. క్రీడలతో క్రమశిక్షణ, ఐకమత్యం పెంపొందుతాయని తెలిపారు. పోటీల విజయవంతానికి సహకరిస్తున్న అన్ని శాఖల అధికారులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు తమ నిజయోజకవర్గంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత యువతను క్రీడల వైపు మళ్లించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలు ముగిసిన వెంటనే జాతీయ స్థాయి బాలికల పోటీలు కూడా ఇక్కడే నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భద్రాద్రి డీఈఓ నాగలక్ష్మి, మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తొలిరోజు ఉమ్మడి జిల్లా జట్ల సత్తా..
69వ రాష్ట్ర స్థాయి అండర్ –17 కబడ్డీ పోటీల్లో తొలిరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్లు అద్భుత ప్రతిభ కనబరిచాయి. బాలుర జట్టు కరీంనగర్‌తో తలపడి విజయం సాధించగా.. బాలికల జట్టు కూడా హైదరాబాద్ జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బాలికల జట్టు విజయంలో స్నేహ ఉత్తమ ప్రతిభ కనబరిచి అందరి దృష్టినీ ఆకర్షించింది.
వేడుకలకు మంత్రులు దూరం
ఏడూళ్ల బయ్యారంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్ – 17 కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఎవరూ హాజరుకాలేదు. దీంతో పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, కోచ్‌లు నిరుత్సాహానికి గురయ్యారు.
ఏజెన్సీలో జోష్..


