ఎల్‌ఐసీ పరిరక్షణకు ఉద్యమం
● ఎన్‌డీఏ హయాంలో ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ● ఎల్‌ఐసీ ఏఓఐ సౌత్ సెంట్రల్ జోనల్ మహాసభలో సాయిబాబు, బోస్
ఖమ్మంమయూరిసెంటర్: దేశ ప్రజల కష్టార్జితంతో ఏర్పడిన ఎల్‌ఐసీ పరిరక్షణకు ఏజెంట్లు సైనికుల్లా పనిచేయాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. ఎల్‌ఐసీ ఏజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా(ఏఓఐ) సౌత్ సెంట్రల్ జోనల్ ఆరో మహాసభలు శనివారం ఖమ్మంలో ప్రారంభమయ్యాయి. సంఘం పతాకాన్ని ఏఓఐ ఆలిండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల మంజునాథ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో సాయిబాబు మాట్లాడుతూ ప్రైవేట్ కంపెనీల దోపిడీ నుంచి ప్రజలను కాపాడేందుకు 1956లో ఎల్‌ఐసీని ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద బీమా కంపెనీగా ఉండగా.. మళ్లీ ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి ఎల్‌ఐసీని ప్రజలకు దూరం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎల్‌ఐసీనే కాక బ్యాంకులు, రైల్వేలు, బొగ్గు, రక్షణ, విద్యుత్తు తదితర ప్రభుత్వ రంగాల్లో కూడా ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించే చర్యలు వేగవంతం చేసిందని ఆరోపించారు. ఈమేరకు మిగతా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులను కలుపుకుని ఐక్య పోరాటాల ద్వారా ఎల్‌ఐసీ పరిరక్షణకు ఉద్యమించాలని సూచించారు. కాగా, ఎల్‌ఐసీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని పార్లమెంట్ సభ్యులు సంతకాలు చేసినా, ఎల్‌ఐసీలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ద్వంద్వ వైఖరిని బయటపెట్టారని విమర్శించారు. ఎల్‌ఐసీ ఏఓఐ అఖిలభారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురజిత్ కుమార్ బోస్, పి.జి.దిలీప్ మాట్లాడుతూ ఎల్‌ఐసీ ఏజెంట్లకు నష్టం కలిగించేలా అనేక ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయని తెలిపారు. ఈ చర్యలను తమ యూనియన్ వ్యతిరేకిస్తూ చేసే పోరాటంలో అందరూ కలిసి రావాలని కోరారు. మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ డాక్టర్ సి.భారవి ప్రారంభ ఉపన్యాసం చేయగా, యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి పీఎల్.నరసింహారావు, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షుడు జి తిరుపతయ్య, ఖమ్మం ఎల్‌ఐసీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ బాలాజీనాయక్ మాట్లాడారు. ఇంకా ఈ సమావేశంలో ఏఓఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్లూరు శ్రీనివాసరావు, తన్నీరు కుమార్, ఖమ్మం అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రసాద్, టి.వెంకటరమణ, నవీన్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.


