
బీసీ రిజర్వేషన్‌తోనే మోదీకి పీఎం పదవి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు
సత్తుపల్లి: గుజరాత్‌లో బీసీ రిజర్వేషన్‌తోనే మోదీకి ప్రధాన మంత్రి పదవి దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన బంద్‌లో భాగంగా సత్తుపల్లిలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్‌లో తుమ్మల మాట్లాడుతూ చట్టబద్ధంగా చేసిన సవరణలను చూసి రిజర్వేషన్ల ఆమోదానికి ప్రధాని మోదీ కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో బీసీలకు అన్యాయం చేసిన బీజేపీకి రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా గవర్నర్, రాష్ట్రపతి వద్ద పెండింగ్ పెట్టడం బీజేపీ ధ్వందవైఖరికి నిదర్శనమని తెలిపారు. సామాజిక న్యాయం కోసం రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీ గణన చేపట్టి బీసీ బిల్లును తీసుకొచ్చారని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్, నాయకులు గాదె చెన్నారావు, దండు ఆదినారాయణ, ఉడతనేని అప్పారావు, ఎం.డీ.కమల్‌పాషా, కె.సర్వేశ్వరరావు, నిమ్మటూరి రామకృష్ణ, టి.యోబు, తోట సుజలరాణి తదితరులు పాల్గొన్నారు.