
శాంతిభద్రతల రక్షణలో పోలీసులే కీలకం
ఖమ్మంక్రైం: శాంతి భద్రతల సంరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం(ఫ్లాగ్ డే) సందర్భంగా ఖమ్మంలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీసు కమిషనర్ సునీల్‌దత్, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తూ, అమరులైన సిబ్బందికి నివాళులర్పించడం అందరి బాధ్యత అని తెలిపారు. ఏ కార్యక్రమమైనా శాంతియుతంగా కొనసాగాలంటే పోలీసుల సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. దీపావళి, హోలీ, వినాయక నిమజ్జనం వంటి వేడుకలు ప్రశాంతంగా కొనసాగడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నందున, పౌరులు వారికి కృతజ్ఞతగా ఉండాలని తెలిపారు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ ప్రజారక్షణ కోసం అహర్నిశలు ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తించే పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని తెలిపారు. కాగా, పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈనెల 24న రక్తదాన శిబిరం, 25న సైకిల్ ర్యాలీ, 27వ తేదీన సిబ్బందికి వ్యాసరచన పోటీలు, 28వ తేదీన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తొలుత అధికారులు, అమరవీరుల కుటుంబసభ్యులు స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఈ ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన 191 మంది పేర్లను ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి వినిపించారు. అడిషనల్ డీసీపీలు రామానుజం, ప్రసాద్‌రావు, ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు, సుశీల్‌సింగ్, నర్సయ్య, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు, అప్పలనాయుడు, నాగుల్‌మీరా, సీఐలు కరుణాకర్, బాలకృష్ణ, మోహన్‌బాబు, భానుప్రకాష్, రాజిరెడ్డి, రామకృష్ణ, చిట్టిబాబు, సత్యనారయణ, ఉస్మాన్‌షరీఫ్, స్వామి పోలీస్ అసోసియేషన్ నాయకుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు,
అమవీరుల సంస్మరణ దినోత్సవంలో
కలెక్టర్ అనుదీప్

శాంతిభద్రతల రక్షణలో పోలీసులే కీలకం