
నోటరీ వ్యవస్థలో డిజిటల్ విప్లవం
● పారదర్శకత కోసం మరో అడుగు ● రెన్యూవల్ కాకపోతే సీఓపీల తొలగింపు ● ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 41 మంది సీఓపీలకు అనుమతి ● నవంబర్ 1 నుంచి ఆన్‌లైన్ విధానం ప్రారంభం
ఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత కోసం సమూల మార్పులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్, భూరికార్డుల డిజిటలైజేషన్, ఆన్‌లైన్ ద్వారానే స్టాంప్ వెండింగ్ అమలు చేస్తుండగా ఇప్పుడు కీలకమైన నోటరీ విధానాన్ని కూడా ఆన్‌లైన్ చేయాలని నిర్ణయించింది. ఈ విధానం నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. తద్వారా నోటరీ కార్యకలాపాల్లో జవాబుదారీతనం పెరిగి, మోసాలకు తావు లేకుండా చేయొచ్చని ఆ శాఖాధికారులు భావిస్తున్నారు.
లైసెన్స్ ఉంటేనే అనుమతి
నోటరీ పబ్లిక్‌గా పనిచేసే న్యాయవాదుల విషయంలో స్పష్టత తీసుకొచ్చేలా ప్రభుత్వం సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీఓపీ) లైసెన్స్ కలిగిన వారి వివరాలనే ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తోంది. తద్వారా చట్టపరమైన అర్హత కలిగిన వారే నోటరీ సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాక న్యాయవాదుల వివరాలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. నోటరీ పబ్లిక్‌లు జారీ చేసే ప్రతీ నోటరీని పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా కక్షిదారుడికి ఇచ్చే నోటరీ వివరాలు, సంతకాలు చేశాకే ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. కక్షిదారుల వివరాలు, వారు సమర్పించిన ధ్రువపత్రాల వివరాలు పక్కాగా ఉంటేనే నోటరీ జారీ చేయాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలివ్వడం, రికార్డులన్నీ ఆన్‌లైన్‌లో భద్రపర్చడం ద్వారా భవిష్యత్‌లో వివాదాలు ఎదురైతే ప్రామాణికంగా ఉంటాయి.
రెన్యూవల్ కాకపోతే రద్దు
నోటరీ విధానంలో పాత, వినియోగంలో లేని లైసెన్స్‌లకు చెక్ పెట్టేలా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా తమ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీఓపీ) లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోని వారి లైసె న్సులు తొలగించే ప్రక్రియ మొదలైంది. సీఓపీ కలిగిన నోటరీ న్యాయవాదులు తమ లైసెన్సును ప్రతీ ఐదేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. కాల పరిమితి ముగిసే ఆరు నెలల ముందే జిల్లా రిజిస్ట్రార్ (స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాలపరిమితి ముగిశాక రెన్యూవల్‌కు వస్తే సమస్యలు తలెత్తుతున్నందున ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
సామాన్య ప్రజలకు మేలు
ఆన్‌లైన్ విధానం ద్వారా సామాన్య ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. నోటరీ ద్వారా ధ్రువీకరించిన పత్రాలు ఆన్‌లైన్‌లో నమోదు కానుండడంతో విశ్వసనీయత పెరుగుతుంది. అనధికార వ్యక్తులు నోటరీగా చెలామణి అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. నోటరీ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ప్రభుత్వ నిర్ణయం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కొనసాగుతున్న సంస్కరణల్లో దీనిని కీలక అడుగుగా భావిస్తున్నారు.
పారదర్శకత కోసం ప్రభుత్వం అన్ని సేవలను డిజిటలైజేషన్ చేస్తోంది. అందులో భాగంగానే నోటరీలు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేశాకే కక్షిదారులకు అందించాలని నిర్ణయించింది. ఈ విధానం నవంబర్ 1నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటికే జిల్లాలో యాక్టివ్‌గా ఉండి, రెన్యూవల్ అయిన సీఓపీ లైసెన్సులను ఆన్‌లైన్ చేస్తున్నాం. ఈ విధానంపై న్యాయవాదులకు అవగాహన కల్పిస్తున్నాం.
–ఎం.రవీందర్‌రావు,
జిల్లా రిజిస్ట్రార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ

నోటరీ వ్యవస్థలో డిజిటల్ విప్లవం

నోటరీ వ్యవస్థలో డిజిటల్ విప్లవం