● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మంరూరల్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం, తల్లంపాడులో రహదారుల నిర్మాణానికి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కొండాపురం నుంచి ముఠాపురం వరకు రూ.7.50కోట్లతో బ్రిడ్జి, పొన్నేకల్ నుంచి కొండాపురం వరకు రూ.5.20కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే, పీహెచ్‌సీ నిర్మాణం, పెద్దకుంట చెరువు శాశ్వత మరమ్మతు పనులు చేపడుతామని వెల్లడించారు. రాష్ట్రంలో పేదలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందిస్తుండగా, తెల్లరేషన్‌కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే, దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కాగా, మండలంలోని మద్దులపల్లిలో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల భవన పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. రూ.25కోట్లతో మూడు అంతస్తులు గా చేపడుతున్న నిర్మాణం తుది దశలో ఉందని తెలి పారు. డీఏఓ డి.పుల్లయ్య, ఆర్‌డీఓ నర్సింహారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యత