
పత్తి కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
● ఉమ్మడి జిల్లాలో 14జిన్నింగ్ మిల్లులకు అనుమతి ● తాత్కాలిక రిజిస్ట్రేషన్ల విధానం రద్దు
ఖమ్మంవ్యవసాయం: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పచ్చజెండా ఊపింది. జిన్నింగ్ మిల్లుల ఎంపిక పూర్తి కావడంతో కొనుగోళ్లు మొదలుకానున్నాయి. ఈమేరకు తిరుమలాయపాలెం మండలం గోల్‌తండాలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్‌లో తొలి కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తేమశాతం ఆధారంగా పత్తి క్వింటాకు గరిష్టంగా రూ. 8,110 ధర నిర్ణయించింది. అయితే వ్యాపారులు తేమ, నాణ్యత పేరిట రూ.6,500కు మించి చెల్లించడం లేదు. ఇంతలోనే సీసీఐ కేంద్రాలకు ఏర్పాటుకు జిన్నింగ్ మిల్లుల యజమానులు ముందుకు రాకపోతే ప్రభుత్వ జోక్యంతో కొనుగోళ్లకు లైన్‌క్లియర్ అయింది. ఉమ్మడి జిల్లాలో ఈఏడాది 4.46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. తద్వారా 50 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.
14 మిల్లులకు అనుమతి
పత్తి కొనుగోళ్లకు ఖమ్మం జిల్లాలో జీఆర్‌ఆర్ ఇండస్ట్రీస్(వెంకటగిరి), శ్రీసాయిబాలాజీ జిన్నింగ్ మిల్(తల్లంపాడు), అమరావతి టెక్స్‌టైల్స్(దెందుకూరు), మంజీత్ కాటన్ మిల్స్(మాటూరు), శ్రీ శివగణేష్ కాటన్ ఇండస్ట్రీస్(ఇల్లెందులపాడు), స్టాపిలచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్(తల్లాడ), జీఆర్‌ఆర్ జిన్నింగ్ మిల్(పొన్నెకల్), శ్రీ భాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్(గోల్ తండా)తో పాటు భద్రాద్రి జిల్లాలో ఆరింటిని ఎంపిక చేశారు.
ఎకరాకు 12 క్వింటాళ్లు
పంట దిగుబడిని అంచనా వేశాక ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి అవకాశం కల్పించారు. అయితే, ఈ ఏడాది అధిక వర్షాలతో ఎకరాకు ఐదు క్వింటాళ్లు మించే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ పోర్టల్‌లో పంట నమోదై ఉండడమే కాక ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే విక్రయానికి అనుమతిస్తారు. కాగా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ల(టీఆర్) విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కౌలు రైతుల కోసం ఈ విధానాన్ని తీసుకొస్తే కొందరు ఉద్యోగులు, వ్యాపారులు ఏకమై అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో పట్టాదారు అనుమతితో కౌలు రైతుల ద్వారా విక్రయ బాధ్యత ఏఈఓలకు అప్పగించారు.