నిధులు రావాల్సి ఉంది..
● మూడేళ్లుగా అందని నిర్వహణ నిధులు ● ఒక్కో క్లస్టర్‌కు రూ.3.33 లక్షల బకాయి ● భారం భరించలేక ఏఈఓల ఇక్కట్లు
భారంగా
మారిన
నేలకొండపల్లి/కామేపల్లి: రైతులకు సాగులో మెళుకువలు, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించడమే కాక శాస్త్రవేత్తల ద్వారా సలహాలు ఇప్పించాలనే లక్ష్యంతో నిర్మించిన రైతు వేదికల ద్వారా ఆ స్థాయిలో సేవలు అందడం లేదు. నిర్వహణ నిమిత్తం గత మూడేళ్లగా ప్రభుత్వం పైసా విదల్చకపోవటంతో వ్యవసాయ విస్తీరణాధికారులు (ఏఈఓ) సొంత నగదుతో నెట్టుకొస్తున్నారు. దీంతో రైతు వేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఒక్కో క్లస్టర్‌కు దాదాపు రూ.3.33 లక్షల వరకు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. పనిభారంతో సతమతం అవుతున్న తాము ఇకపై నగదు వెచ్చించే స్థితిలో లేమని ఏఈఓలు వాపోతున్నారు.
2020లో నిర్మాణం
గత ప్రభుత్వం 2020లో ప్రతీ వ్యవసాయ క్లస్టర్‌కు ఓ రైతు వేదికను నిర్మించింది. జిల్లాలో 129 రైతు వేదికలు నిర్మించగా నిర్వహణ కోసం నెలకు రూ.3 వేల చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు. ఆ నిధులు చాలవని వ్యవసాయ శాఖ నివేదించడంతో రూ.9 వేల చొప్పున నిధులు విడుదల చేస్తామని 2020 ఏప్రిల్‌లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత 2022 నవంబర్‌లో ఐదు నెలలకు సంబంధించి రూ.45 వేల చొప్పున విడుదలయ్యాయి. ఇక అప్పటి నుంచి అంటే 37 నెలలకు సంబంధించి ఒక్కో రైతువేదికకు దాదాపు రూ.3.33 లక్షల నిధులు బకాయి ఉన్నాయి.
వసతులు కరువు
అట్టహాసంగా నిర్మించిన రైతు వేదికల్లో కనీస వసతులు కానరావడం లేదు. ఏఈఓలు పంటలకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా కంప్యూటర్లు ఉన్నా విద్యుత్ బిల్లులు, మరమ్మతులకు నిధులు రావడం లేదు. ఉన్నతాధికారులకు పంపించాల్సిన నివేదికలు ప్రింట్ తీయడానికి ప్రింటర్లు కూడా లేవు. స్టేషనరీ, తాగునీటి ఖర్చులన్నీ ఏఈఓలే భరించాల్సి రావడం, సహాయకులు కూడా లేక అన్ని పనులు చేయాల్సి వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, శుభ్రం చేయించే బాధ్యత జీపీలు నిర్వహించాని సూచించినా వారూ పట్టించుకోవడం లేదు. అంతేకాక చాలా చోట్ల నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. దీంతో మహిళా ఉద్యోగులు, రైతులు మరింత అవస్త పడుతున్నారు. అలాగే, 2019లో ఏఈఓలకు ఇచ్చిన ట్యాబ్‌లు సైతం సరిగా పనిచేయక నివేదికలు అప్‌లోడ్ చేసే సమయాన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
రైతు వేదికలకు నిర్వహణ నిధులు రావాల్సి ఉంది. చాలా చోట్ల సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయి. నిధుల బకాయిలతో పాటు నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం.
– డి.పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి
రైతు వేదికలు
రైతు వేదికలు