
పక్కా ప్రణాళికతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ
ఖమ్మం అర్బన్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలు బాధ్యతగా రోడ్ల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మంలో పది రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణగా రోడ్ల గుంతలు పూడ్చివేయించామని తెలిపారు. కల్లూరు, వైరా, సతుపల్లి, మధిర, ఏదులాపురం మున్సిపాలిటీల పరిధిలోనూ ఇలాగే చేయాలని చెప్పారు. అంతేకాక ఖమ్మం బైపాస్ రహదారిపైనా మరమ్మతులు చేసి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. అలాగే, జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్ల వద్ద త్య్రేక చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలీసు కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ రహదారులు కలిసే చోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని, పార్కింగ్ లేకుండా నూతన పాఠశాలలకు అనుమతి ఇవ్వొద్దని సూచించారు. డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ యాకూబ్, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, ఆర్‌టీఓ వెంకటరమణ, నేషనల్ హైవే పీడీలు రామాంజనేయరెడ్డి, దివ్య పాల్గొన్నారు.
పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఖమ్మం సహకారనగర్: మధిర నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం ఆమె విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్‌తో కలిసి వీసీ ద్వారా సమీక్షించగా ఖమ్మం నుంచి కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ మధిర నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు మొదలుపెట్టాలని, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు సిద్ధం చేయాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ పాఠశాలల్లో టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లు, ల్యాబ్‌ల ఏర్పాటుకు నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే, ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు, మధిర మండలం మహదేవపురం, చింతకాని మండలం నాగులవంచ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అభివృద్ధి చేయనున్నందున పాఠశాల అభివృద్ధి నిర్వహణ కమిటీ పేరిట ఖాతాలు తెరవాలని తెలిపారు. బనిగండ్లపాడులో అభివృద్ధి పనులకు ఈనెల 25న డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్‌దత్