
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..
సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు
ఖమ్మంమయూరిసెంటర్: అతివృష్టితో జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ వర్షాలతో దిగుబడి పడిపోగా, ధర కూడా లేనందున రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఈ విషయమై శుక్రవారం నుంచి 21వ తేదీ వరకు పంటలను పరిశీలించి, ఆతర్వాత మూడు రోజులు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకోతే 30వ తేదీన కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని చెప్పారు. కాగా, బీసీల రిజర్వేషన్ పెంపుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు బి.రమేష్, కె.వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
విద్యార్థుల సృజనాత్మకకు వేదిక
నేడు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎకో బజార్
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్‌ప్స్ ఆధ్వర్యాన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ‘ఎకో ఫ్రెండ్లీ బజార్’ ఏర్పాటుచేస్తున్నారు. ఇందుకోసం ప్రతీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఎకో బజార్ ఏర్పాటుచేయనున్నారు.
విద్యార్థులు ప్రతిభ చాటేలా
మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న ఎకో బజార్‌లో విద్యార్థులు తమ ఆలోచనల నుంచి రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. తక్కువ ఖర్చుతో బృందాలుగా రూపొందించిన ఉత్పత్తుల్లో పూజా వస్తువులు, అలంకరణ సామగ్రి, పిండివంటలు తదితర వస్తువులు ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సృజనాత్మకత, పర్యావరణ చైతన్యం, మార్కెటింగ్ నైపుణ్యాలు పెంపొందుతాయని కాలేజీ ప్రిన్సిపాల్ బానోతు రెడ్డి, ప్రోగ్రాం కోఆర్టినేటర్ రవిశంకర్ తెలిపారు.