
ఆరు సొసైటీల పాలకవర్గాలు రద్దు
● ఆ స్థానంలో పర్సన్ ఇన్‌చార్జిల నియామకం ● మరో ఆరింటిపై త్వరలోనే నిర్ణయం
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పరిధిలోని ఆరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలను మంగళవారం రద్దు చేశారు. ఆ స్థానంలో సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. డీసీసీబీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో విస్తరించి ఉండగా మొత్తం 101 పీఏసీఎస్‌లకు గాను ఖమ్మం జిల్లాలో 76 ఉన్నాయి. వీటి పాలకవర్గాల ఐదేళ్ల కాలపరిమితి ఆగస్టు 14తో ముగియగా పాత పాలకవర్గాలనే ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదేసమయాన పనితీరు సరిగ్గా లేని, అక్రమాలు జరిగిన చోట పర్సన్ ఇన్‌చార్జిలను నియమించాలని ఆదేశించింది.
62 పాలకవర్గాల కొనసాగింపు
జిల్లాలో మొత్తం 76 పీఏసీఎస్‌లకు గాను ఏదులాపురం, చేగొమ్మ, నేలకొండపల్లి, తల్లాడ, కల్లూరు, పోచారం సొసైటీల పాలక వర్గాలను రద్దుచేశారు. ఈ మేరకు వీటి పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు జి.ఉషశ్రీ, ఎస్‌బీవీ.రామిరెడ్డి, కె.రాజశేఖర్, జి.శ్రీనివాసకుమార్, సీహెచ్.రవికుమార్, ఎన్.ఉషారాణిని నియమిస్తూ జిల్లా సహకార అధికారి జి,గంగాధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కుర్నవల్లి, అమ్మపాలెం సంఘాల పాలకవర్గాలు రద్దు కాగా అక్కడ పర్సన్ ఇన్‌చార్జ్‌ల పాలనే కొనసాగుతోంది. ఇక మిగిలిన 68 పీఏసీఎస్‌ల్లో మరో ఆరింటి పాలకవర్గాలను కూడా రద్దు చేయనున్నట్లు తెలుస్తుండగా, మిగతా 62 సంఘాలకు ప్రస్తుత పాలకవర్గాలనే కొనసాగిస్తారు. అలాగే, భద్రాద్రి జిల్లాలో 21 పీఏసీఎస్‌లకు గాను 17 సంఘాల పాలకవర్గాల కొనసాగిస్తూ ఆ జిల్లా సహకార అధికారి అవధానుల శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా నాలిగింటిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.