
చెరువులకు పూర్వవైభవం
● మూడింటి అభివృద్ధికి రూ.75 కోట్లతో ప్రతిపాదనలు ● కట్టల బలోపేతం, ఘాట్ల నిర్మాణానికి నిర్ణయం
ఖమ్మంఅర్బన్: ఒకప్పుడు గ్రామాలు, నగరాల ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించిన చెరువులు కాలక్రమంలో కాలగర్భంలో కలిసే స్థితికి చేరాయి. ఆక్రమణలకు తోడు మురుగునీరు చేరడంతో వాటి వైభవం కోల్పోయాయి. అయితే, ఇలాంటి చెరువులను పునరుద్ధరించి పర్యాటకానికి అనువుగా తీర్చిదిద్దేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఖానాపురం చెరువు, ధంసలాపురం పెద్ద చెరువు, పుట్టకోట(వెలుగుమట్ల) చెరువుల అభివృద్ధికి జలవనరుల శాఖ సుమారు రూ.25 కోట్ల చొప్పున అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
ఆక్రమణల నివారణ, బలమైన కట్టలు
చెరువుల అభివృద్ధిలో భాగంగా తొలిదఫా శిఖం భూములు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ చర్యలు చేపడుతారు. పూర్తిస్థాయిలో శిఖం భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటుచేయడమే కాక చుట్టూ కట్టలను బలోపేతం చేస్తారు. అంతేకాక తూములు, అలుగులకు మరమ్మతు చేసి చెరువుల చుట్టూ సుమారు ఆరు కిలోమీటర్ల మేర బలపరుస్తారు. కట్ట పైనుంచి మట్టి జారకుండా రాళ్లు ఏర్పాటుచేసి కట్టపై రక్షణ కంచె ఏర్పాటుచేయనున్నారు. అలాగే, చెరువులోకి నీరు వచ్చే వాగులపై వంతెనలు నిర్మించి అలుగుల వద్ద కూడా రాకపోకలకు ఇబ్బంది లేకుండా వంతెనల నిర్మాణం చేయాలని ప్రతిపాదనల్లో పొందుపర్చారు.
మురుగునీరు చేరకుండా...
ఖమ్మం నియోజకవర్గంలోని ఎనిమిది చెరువులను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. తొలిదశలో మూడు చెరువులకు సంబంధించి ప్రతిపాదనలు పంపగా, దశల వారీగా మిగతా చెరువులపై దృష్టి సారించనున్నారు. నిధులు మంజూరు కాగానే ప్రతీ చెరువుకు నాలుగు వైపులా బతుకమ్మ ఘాట్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక మురుగునీరు చేరకుండా, కట్టలపై వరద నీరుతో కోతకు గురి కాకుండా నీటి మళ్లింపునకు కాల్వలు నిర్మిస్తారు. ఫలితంగా చెరువులు శుభ్రంగా మారి ఉత్సవాలకు, సాయంకాలం స్థానికులు సేద తీరే వేదికగా నిలవనున్నాయి. ఇదే సమయాన మొక్కలు నాటడంతో పాటు పర్యాటక శాఖ ద్వారా కేఫ్‌లు కూడా ఏర్పాటుచేయాలనే ఆలోచనలో ఉన్నారు.