
ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై చొరవ తీసుకోండి
● కేంద్ర మంత్రికి
రాష్ట్ర మంత్రి తుమ్మల వినతి
ఖమ్మంఅర్బన్/ఇల్లెందు: కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రాంమోహన్‌నాయుడుకు వివరాలు అందజేసి మాట్లాడారు. గతంలో గుర్తించిన స్థలం అనుకూలంగా లేదని తేల్చారని తెలిపారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించిన నేపథ్యాన సర్వే చేయించాలని కోరారు. జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటైతే భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులే కాక సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ పరిశ్రమలకు వచ్చివెళ్లే అధికారులకు అనువుగా ఉంటుందని తెలిపారు. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ.కుమారస్వామిని కూడా కలిసిన తుమ్మల.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, ఆవశ్యకతను వివరించారు.
నేడు ప్రజాపాలన దినోత్సవం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యాన ఏర్పాటు చేసే స్టాళ్లను భట్టి విక్రమార్క సందర్శిస్తారు.