
నాసిరకం ఆయిల్‌పామ్ విత్తనాలపై దర్యాప్తు జరపాలి
సత్తుపల్లి/వైరా: విదేశాల నుంచి నాసిరకం ఆయిల్‌పామ్ విత్తనాలు దిగుమతి చేసి తెలంగాణలోని నర్సరీల్లో పెంచడం ద్వారా రైతులకు నష్టం జరిగి నందున సమగ్ర దర్యాప్తునకు సహకరించాలని తెలంగాణ ఆయిల్‌పామ్ రైతు సంఘం నాయకులు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన అఖిలభారత కిసాన్ సభ(ఏఐకేఎస్) సమావేశంలో జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ దవాలే, వీ.జీ.కృష్ణణ్‌కు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ అంశంపై దర్యాప్తుతో పాటు రైతులకు పరిహారం అందించేలా కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అలాగే, పామాయిల్ గెలల టన్ను ధర రూ.25వేలు ఉండేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, ధర నిర్ణయంలో రైతు సంఘాలకు ప్రాతినిధ్యం దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్‌పామ్ రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు మహేష్‌రెడ్డి, కొక్కెరపాటి పుల్ల య్యతో పాటు నాయకులు టి.సాగర్, బొంతు రాంబాబు, శోభన్, పి.జంగారెడ్డి, శ్రీనివాసులు, సోమయ్య, చందునాయక్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.