
ప్రతిభావంతులకు ప్రోత్సాహం
విద్యార్థులకు ఉపయోగం
సమాచారం ఇచ్చాం..
గత ఏడాది ఎంపికయ్యా...
● నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షకు దరఖాస్తులు ● పరీక్ష ద్వారా అర్హులైన విద్యార్థుల ఎంపిక ● జాబితాలో చోటు దక్కితే నాలుగేళ్ల పాటు ఉపకార వేతనాలు
కొణిజర్ల: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించేలా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్) ప్రవేశపరీక్షకు రంగం సిద్ధమైంది. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేలా ఈ పథకాన్ని కేంద్రం 2008లో ప్రవేశపెట్టింది. ఇందు కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులను అర్హులుగా నిర్దేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో పలువురు బాలబాలికలు ఎనిమిదో తరగతి తర్వాత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మానివేస్తున్నట్లు గుర్తించడంతో 9వ తరగతి నుండి ఇంటర్ వరకు నాలుగేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందించే ఈ పథకం అమలవుతోంది. 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశపరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
అర్హతలు.. దరఖాస్తు విధానం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 7వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించి, ప్రస్తుతం 8వ తరగతి బాలబాలికలు పరీక్ష రాయడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల లోపు ఉంటే అర్హులుగా పరిగణిస్తారు. దరఖాస్తు సమయాన ఆధార్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్, కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. ఓసీ, బీసీలైతే రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు అక్టోబర్ 6వ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆపై దరఖాస్తు ప్రింట్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందిస్తే వారు డీఈఓ కార్యాలయంలో సమర్పిస్తారు.
అక్టోబర్ 23న పరీక్ష
స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులకు అక్టోబర్ 23న పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్ల పాటు ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ నగదు నేరుగా విద్యార్థుల అకౌంట్‌లోనే జమ అవుతుంది. అయితే, పదో తరగతి తర్వాత ఉపకార వేతనం అందాలంటే ఎస్సెస్సీలో కనీసం 60 శాతానికి తగ్గకుండా మార్కులు సాధించాలి.
పరీక్షా విధానం
మొత్తం 180 మార్కులకు ఎంపిక పరీక్ష ఉంటుంది. ఇందులో రీజనింగ్,ఆర్థమెటిక్, పదాలభిన్న పరీక్ష, అంకెలు, అక్షరాల ఎనాలజీ, కోడింగ్, డీ కోడింగ్, లాజికల్, వెన్ చిత్రాలు, ప్రతి బింబాలకు సంబంధించి 90మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. రెండో విభాగంలో 8వ తరగతి సిలబస్ నుంచే 90 ప్రశ్నలు ఇస్తారు. గణితం 20, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 35, సోషల్ స్టడీస్ 35 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో నిర్వహించనుండగా.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎక్కువ మంది హాజరయ్యే ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు.
ఆర్థిక వెసులుబాటు లేని బాలబాలికలకు ఉపకార వేతనాలతో ఉపయోగంగా ఉంటుంది. ఎంపికై తే నాలుగేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందుతుంది. పరీక్షకు చాలా సమయం ఉన్నందున విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం.
– పి.శివన్నారాయణ, హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ గుబ్బగుర్తి
కేంద్రం అమలుచేస్తున్న స్కాలర్‌షిప్ పథకంపై ఇప్పటికే అన్ని పాఠశాలలకు సమాచారం ఇచ్చాం. ఎక్కువ మంది విద్యార్థులతో దరఖాస్తు చేయించి, పరీక్షకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించాం. – డి.అబ్రహం, ఎంఈఓ కొణిజర్ల
గత ఏడాది పరీక్ష రాసి స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యా. ఈ ఏడాది నుంచి నాకు నాలుగేళ్ల పాటు రూ.12 వేల అందుతుందని చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు అభినందించగా, మా అమ్మానాన్న సంతోషించారు.
– తాటి షర్మిల, జెడ్పీహెచ్‌ఎస్, గుబ్బగుర్తి

ప్రతిభావంతులకు ప్రోత్సాహం

ప్రతిభావంతులకు ప్రోత్సాహం

ప్రతిభావంతులకు ప్రోత్సాహం