
డెంగీ నివారణకు చర్యలు
ఏన్కూరు: జిల్లాలో డెంగీ కేసుల కట్టడి, వ్యాప్తి జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ తెలిపారు. ఏన్కూరు పీహెచ్‌సీని మంగళవారం తనిఖీ చేసిన ఆమె గ్రామాల వారీగా నమోదైన డెంగీ కేసులు, చికిత్సపై ఆరా తీశారు. అనంతరం అత్యధిక కేసులు నమోదైన పైనంపల్లి తండాను సందర్శించిన డిప్యూటీ సీఈఓ అక్కడ పారిశుద్ధ్య పనులపై సూచనలు చేశారు. ప్రజలు ఇళ్లు, వ్యక్తిగతంగానే కాక పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఎంపీడీఓ రంజిత్‌కుమార్, వైద్యాధికారులు రాములు, మౌనిక, వేమిరెడ్డి భాస్కరరెడ్డి, శ్యామల, ల్యాబ్ టెక్నీషియన్ పి.వెంకటరమణ పాల్గొన్నారు.
ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్‌లో
కామర్స్ పరిశోధన కేంద్రం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలను మంగళవారం కాకతీయ యూనివర్సిటీ కామర్స్ ప్రొఫెసర్ల బృందం సందర్శించింది. కళాశాల కామర్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాన్ని పరిశోధనా కేంద్రంగా గుర్తించేందుకు అవసరమైన లైబ్రరీ, ఈ–జర్నల్స్, ఇంటర్నెట్ సదుపాయం, అధ్యాపకుల అర్హతలను వారు సమీక్షించారని ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. ఈ బృందం చైర్మన్‌గా ప్రొఫెసర్ కట్ల రాజేందర్ వ్యవహరించగా, ప్రొఫెసర్లు హనుమంతరావు, పి.అమరవేణి, పి.వరలక్ష్మి, ఎస్.నరసింహాచారి, ఎం.యాదగిరి, కోలా శంకర్ ఉన్నారని వెల్లడించారు. ప్రొఫెసర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అవకాశముంటుందని తెలిపారు. కాగా, కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యాన అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ జకీరుల్లా తెలిపారు.
టీచర్ల సర్దుబాటుపై సమీక్ష
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో అదనంగా ఉన్న పాఠశాలల నుంచి అవసరమైన చోటకు ఉపాధ్యాయుల సర్దుబాటుపై అధికారులు మంగళవారం సమీ క్షించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ చావా శ్రీనివాసరావు ఎంఈఓలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొనగా, ఇప్పటికే సిద్ధమైన జాబితాలో మార్పులు, చేర్పులపై చర్చించారు. కలెక్టర్ ఆమోదం అనంతరం టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు వెలువడే అవకాశముందని తెలిసింది.