
వైరా కారులో వార్!
దిశానిర్దేశం లేక కేడర్‌లో నిస్తేజం
జిల్లా పార్టీ అనుమతి లేకుండానే
మండల కమిటీల ఏర్పాటు
ఆపై రద్దు చేస్తూ
జిల్లా అధ్యక్షుడి ప్రకటన
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య పోరు జిల్లా పార్టీకి తలనొప్పులు తెస్తోంది. ఎవరి అనుమతి లేకుండానే నియోజకవర్గంలోని కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు మండలాల కమిటీలను నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉండగా అటు భద్రాద్రి, ఇటు ఖమ్మం జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకే జూలూరుపాడు కమిటీ ఎన్నిక జరిగిందని అక్కడి నేతలు ప్రకటించారు. కానీ ఎవరి ఆమోదం లేదని, ఇది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనంటూ కమిటీలను రద్దు చేస్తూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
బహు నాయకత్వంతో గందరగోళం
భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) అధికారంలో ఉన్న పదేళ్లు వైరా నియోజకవర్గంలో బహు నాయకత్వం రాజ్యమేలింది. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున బానోతు చంద్రావతి పోటీ చేసి ఓడిపోగా.. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచిన బానోతు మదన్‌లాల్ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆపై 2018లో బానోతు మదన్‌లాల్ ఓడిపోగా, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్ బీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. బీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి ఉన్న నేతలకు ఆదరణ దక్కకపోగా.. ప్రతీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తుండడంతో నాయకులు పెరిగి పార్టీ కేడర్‌లో అసంతృప్తికి కారణమైంది. కాగా, బీఆర్‌ఎస్‌లో మదన్‌లాల్ తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాక రాములునాయక్ చేరడంతో రాజకీయాలు మలుపు తిరిగాయి. పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోవడమే కాక మదన్‌లాల్, రాములునాయక్ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగానే నిర్వహించారు. అయినా జిల్లా, రాష్ట్ర నాయకత్వాలు వర్గపోరును ఆపలేకపోయాయి. చివరకు 2023లో పార్టీ తరఫున మదన్‌లాల్‌కు టికెట్ ఇచ్చినా విజయం దక్కలేదు.
చుక్కాని లేని నావలా..
అధికారంలో ఉండగా బహు నాయకత్వంతో ఇబ్బంది పడిన వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్ శ్రేణులు.. అధికారం కోల్పోయాక నాయకత్వ సమస్య ఎదుర్కొంటున్నాయి. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధిష్టానం మదన్‌లాల్‌కు టికెట్ ఇవ్వగా, సిట్టింగ్ ఎమ్మెల్యే రాములునాయక్‌ను బుజ్జగించినప్పటికీ ఆయన రాజీనామా చేశారు. అయితే, మదన్‌లాల్‌కు ఓటమి ఎదురుకావడం, ఆపై ఆయన మృతితో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు నాయకత్వం కరువైంది. ప్రతిపక్షంలో ఉండడంతో ఏ ఆందోళన నిర్వహించాలన్నా సమన్వయం చేసే వారు లేకపోగా, మండల కమిటీల నియామకం కూడా కొన్నిచోట్ల జరగలేదు.
ఎవరికి వారే..
ఎన్నికల్లో ఓటమితో బీఆర్‌ఎస్‌లో నైరాశ్యం నెలకొని, పార్టీ కేడర్‌ను పట్టించుకునే నాయకుడు కరువయ్యాడు. ఈక్రమంలోనే మండల కమిటీలు లేకపోగా అటు రాష్ట్ర, ఇటు జిల్లా అధిష్టానం అనుమతి లేకుండానే జూలూరుపాడు, ఏన్కూరు, కొణిజర్ల మండల కమిటీలను నియమించుకోవడం వివాదాస్పదమైంది. జూలూరుపాడులో గత నెల 31న బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధుసూదన్ అనుమతితో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పగా, ఆతర్వాత ఏన్కూరు, కొణిజర్ల మండల కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి.
ఆ నియామకాలు చెల్లవు
మండల కమిటీల నియామకాలు చెల్ల వని తాజాగా బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ ప్రకటించారు. అధిష్టానం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే గ్రామ, మండల, జిల్లా కమిటీల నియామకాలు జరగుతాయని, అప్పటి వరకు చేపట్టే నియామకాలు చెల్లవని పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.
నియోజకవర్గ బీఆర్‌ఎస్‌లో ఎవరి దారి వారిదే