
ఎంతో మేలంట!
విత్తనాల సరఫరా..
పోషకాహారం అందించేందుకే..
ఇంటి పంట..
అంగన్‌వాడీ కేంద్రాల్లోనే కూరగాయల సాగు
● చిన్నారులు, గర్భిణులకు పోషకాహారం అందించేలా చర్యలు ● కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు
ఖమ్మంమయూరిసెంటర్ : చిన్నారులు, గర్భిణులకు పోషకాహారం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో అందించే ఆహారంలో వినియోగించే ఆకు కూరలు, కూరగాయలు అక్కడే పండించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. తద్వారా అంగన్‌వాడీలకు వచ్చే చిన్నారులు, బాలింతలకు నాణ్యమైన, పోషకాహారం అందనుంది.
రూ.10 వేల చొప్పున విడుదల..
జిల్లాలో ఎంపిక చేసిన 159 అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు రూ.10వేల చొప్పున నిధులు కేటాయించగా ఆవరణల్లో తోటలు, కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పెంచనున్నారు. బయట మార్కెట్లపై ఆధారపడకుండా, రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ కూరగాయలు పండించడం ద్వారా ఆహార నాణ్యత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు పౌష్టికాహార లోపం తీవ్ర సమస్యగా మారింది. ఆయా సెంటర్ల ఆవరణల్లో వంకాయ, బెండ, టమాటా, గోంగూర, తోటకూర, పాలకూర వంటివి పెంచుతుండగా పిల్లలకు అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు అందించి, శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడనున్నాయి.
పిల్లలకూ అవగాహన..
కూరగాయలు, ఆకు కూరల తోటల పెంపకంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలది కీలక పాత్ర. తోటల నిర్వహణలో పిల్లలను కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి వ్యవసాయం, పర్యావరణంపై అవగాహన కల్పించొచ్చు. కూరగాయలు ఎలా పండుతాయి, వాటిని ఎలా సంరక్షించాలి అనే విషయాలు నేరుగా అనుభవం ద్వారా తెలుస్తాయి. ఇది ఒక రకంగా ప్రయోగాత్మక విద్యగా కూడా ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు.
నిధుల వినియోగంపై శిక్షణ..
ఒక్కో అంగన్‌వాడీ సెంటర్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 వేల నిధులు ఎలా వినియోగించాలి, ఏ మొక్కలు నాటాలి, తోటను ఎలా నిర్వహించాలి అనే విషయాలపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ నిధులతో విత్తనాలు, కుండీలు, మట్టి, ఇతర పనిముట్ల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాటు కిచెన్ గార్డెన్లను నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే పటిష్ట పర్యవేక్షణ అవసరమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
నేలకొండపల్లి: కూరగాయలు, ఆకుకూరల పెంపకానికి పక్కా అంగన్‌వాడీ భవనాలు, సొంత స్థలాలు, నీటి సరఫరా, ప్రహరీ ఉన్న కేంద్రాలను ఎంపిక చేశారు. ప్రతీ కేంద్రానికి టమాటా, బెండకాయ, వంకాయతో పాటు ఆకుకూరల సాగుకు అవసరమైన విత్తన ప్యాకెట్లను కూడా ప్రభుత్వం సరఫరా చేసింది.
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించేందుకే సొంతంగా కూరగాయల సాగు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలో అన్ని సౌకర్యాలు గల 159 కేంద్రాలను ప్రస్తుతానికి ఎంపిక చేశాం. ఆయా సెంటర్లకు విత్తనాలు ఇప్పటికే పంపిణీ చేయగా నిర్వహణ ఖర్చులు కూడా అందిస్తాం.
– రామ్‌గోపాల్‌రెడ్డి, డీడబ్ల్యూఓ, ఖమ్మం

ఎంతో మేలంట!