
తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా సాగు
● ఆయిల్‌పామ్ సాగుకు అశ్వారావుపేటనే ఆదిగురువు ● వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అశ్వారావుపేటరూరల్: దేశంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలోనే అత్యధికంగా ఆయిల్‌పాం తోటలు సాగు చేస్తున్నారని, ఆ తర్వాత కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో సాగవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు. గెలల నిల్వలు, కన్వేయర్ బెల్ట్, యంత్రాలతోపాటు పవర్ ప్లాంట్ తనిఖీ చేశారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆయిల్‌పాం తోటల సాగుకు అశ్వారావుపేట మండలం ఆదిగురువని, ఇక్కడ పంట బాగుందంటేనే మిగిలిన ప్రాంతాల్లో విస్తరిస్తోందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎకరం విలువ రూ.5 కోట్లపైనే ఉన్నా ఆయిల్‌పాం తోటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. సిద్ధిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కాగా ట్రయిల్ రన్ నడుస్తోందని తెలిపారు. వేంసూరు మండలం కల్లూరిగూడెంలో, కొణిజర్లలో పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం ఏడాదిలోపు పూర్తవుతుందని అన్నారు. వనపర్తి, బీచ్‌పల్లిలో కూడా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్‌పామ్ గెలల టన్ను ధర రూ.25 వేలకు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులకు విన్నవించినట్లు తెలిపారు. తొలుత పామాయిల్ తోటలు, ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చిన యాద్రాద్రి జిల్లా రైతులు మంత్రిని కలిశారు. ఈ కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ అధికారులు సుధాకర్ రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్లు నాగబాబు, కల్యాణ్, నాయకులు ఆలపాటి రామచంద్రప్రసాద్, మొగళ్లపు చెన్నకేశవరావు, బండి భాస్కర్, జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, ఎస్‌కే పాషా, పి.జీవన్‌రావు, రైతులు పాల్గొన్నారు.