
రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
ఖమ్మంమయూరిసెంటర్ : 1975 బ్యాచ్‌కు చెందిన రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం, స్వర్ణోత్సవాలు ఆదివారం ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. కన్వీనర్ బసవరాజు ఉపేందర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రిటైర్డ్ ఉద్యోగులు తమ ఉద్యోగ విరమణ తర్వాత మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎర్నేని రామారావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు మాట్లాడుతూ 1975లో నాటి ఖమ్మం కలెక్టర్ స్వర్గీయ పి.వి.ఆర్.కె.ప్రసాద్ ఉద్యోగ నియామక ఉత్తర్వులు మంజూరు చేశారని స్మరించుకున్నారు. 50 ఏళ్ల క్రితం మొదలైన తమ ప్రయాణం.. కేవలం విధులకే పరిమితం కాకుండా, మానవ విలువలు, స్నేహ బంధం, పరస్పర సహకారానికి నిదర్శనంగా నిలిచిందని వెల్లడించారు. ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టి.రామరావు, మురళీకృష్ణ, సుధాకర్, సుబ్బయ్య, సైదయ్య, ప్రముఖ గాయకుడు గణపతిరాజు తదితరులు పాల్గొన్నారు.