
మహిళా వికాసం
అతివల స్వయం ఉపాధికి ఉచిత శిక్షణ
ఇప్పటికే 12 వేల మందికి పైగా ట్రైనింగ్
భోజన, వసతి సౌకర్యాలు కూడా..
మహిళలు స్వయం ఉపాధి పొందుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాలనేదే లక్ష్యం. ఇప్పటివరకు 12 వేల మందికి పైగా శిక్షణ ఇచ్చాం. ఈ ఏడాది 350 మందికి వివిధ రంగాల్లో శిక్షణ కొనసాగుతోంది. ఉన్నతాధికారుల తోడ్పాటుతో మహిళాభివృద్ధికి కృషి చేస్తున్నాం.
– వేల్పుల విజేత, మహిళా ప్రాంగణం మేనేజర్
ఖమ్మంఅర్బన్: మహిళలు ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో ఖమ్మం నగరంలోని దుర్గాబాయి మహిళా వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం) పని చేస్తోంది. ఇక్కడ ఇప్పటివరకు 12 వేల మందికిపైగా మహిళలు వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది ఆర్థికాభివృద్ధి సాధించారు. ఇంకా వందలాది మంది శిక్షణ పొందుతూనే ఉన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన కొందరు మహిళలు మరో బ్యాచ్ వారికి ట్రెయినర్లుగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు అంటున్నారు.
శిక్షణతో పాటు వసతి..
మహిళా ప్రాంగణంలో వ్యవసాయం, టైలరింగ్, కంప్యూటర్లు, బ్యూటీషియన్, డ్రోన్ వినియోగం, నర్సింగ్ వంటి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. పంటల సాగులో డ్రోన్ వినియోగంపై శిక్షణ తీసుకోవాలంటే ప్రైవేట్‌గా అయితే రూ.45వేలు, కంప్యూటర్ కోర్సుకు రూ.20వేలు, నర్సింగ్‌కు రూ.లక్ష వరకు ఖర్చవుతుండగా ఇక్కడ పూర్తి ఉచితంగా నేర్పిస్తున్నారు. పంటలపై పురుగుమందులు పిచికారీ చేయడంలో డ్రోన్ వినియోగం ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ కోర్సులో 45 రోజుల పాటు శిక్షణ ఇస్తుండగా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన 30 మంది ట్రైనింగ్ పొందుతున్నారు. టైలరింగ్‌లో రెండు నెలల పాటు శిక్షణ ఇస్తుండగా ప్రస్తుతం 30 మంది, రెండు నెలల కంప్యూటర్ కోర్సులో 30 మంది, 45 రోజుల బ్యూటీషియన్ శిక్షణ పొందుతున్న వారు 20 మంది ఉన్నారు. రెండేళ్ల నర్సింగ్ కోర్సులో 40 మంది మహిళలకు శిక్షణ కొనసాగుతోంది.

మహిళా వికాసం