విస్తృత ప్రచారంతోనే అడ్మిషన్లు
● ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన అడ్మిషన్లు ● ఈ ఏడాది ఇంటర్ ప్రథమలో 3,287 మంది.. ● గతేడాది ప్రవేశాలు 2,494 మాత్రమే ● ప్రభుత్వ కాలేజీల్లో సౌకర్యాలపై విస్తృత ప్రచారం
ఖమ్మంసహకారనగర్: ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలలు అంటే అంతంతమాత్రపు సౌకర్యాలు, అందీఅందని పుస్తకాల వంటి సమస్యలు ఉండేవి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేర్పించేందుకు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. అయితే సర్కారు కళాశాలల్లో క్రమంగా సౌకర్యాలు పెంచడం, అడ్మిషన్ల పెంపునకు అధ్యాపకులు గ్రామాల్లో తిరుగుతూ తల్లిదండ్రులను ప్రోత్సహించడం వంటి చర్యలతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ విద్యా సంవత్సర ప్రవేశాల గడువు ఆగస్టు 31తో ముగియగా 3,287 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందారు. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. వీటిలో గతేడాది 2,494 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో చేరారు. ఈ సంవత్సరం 793 మంది అధికంగా చేరడం విశేషం.
సౌకర్యాల పెంపుతోనే..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతంలో విద్యాబోధనతోనే సరిపుచ్చగా.. ప్రస్తుతం విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎప్‌సెట్ కోచింగ్ సైతం అందిస్తోంది. ఎక్కడా అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు చేపడుతోంది. ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పెంచేందుకు ఫిబ్రవరి, మార్చి నెలల నుంచే అధ్యాపకులు గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక ఫలితాలు వెల్లడయ్యాక తాము సాధించిన రిజల్ట్‌పై కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. ఎంసెట్ కోచింగ్, విద్యార్థులకు అందించే వ్యక్తిత్వ వికాస తరగతులు తదితర అంశాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రవేశాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.
మూడు కాలేజీలు మినహా..
జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా అందులో ఒకటి గతేడాది, మరొకటి అంతకుముందు సంవత్సరం ప్రారంభించారు. మొత్తంగా మూడు మినహా మిగతా అన్ని కాలేజీల్లోనూ అడ్మిషన్లు గతం కంటే పెరిగాయి. కూసుమంచిలో గతేడాది ప్రారంభమైన కళాశాలలో 53 మంది ఉండగా.. ఈ ఏడాది 93 మందికి పెరిగారు. వేంసూరు మండలం కందుకూరు కళాశాల రెండేళ్ల క్రితం ప్రారంభం కాగా గతేడాది 13 మంది చేరితే ఈసారి ఆ సంఖ్య 17కు మాత్రమే పెరిగింది. ఇక ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో గతేడాది 435 మంది విద్యార్థులు చేరగా.. ప్రస్తుతం 419 మందికే పరిమితమైంది. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ గతేడాది 100 మంది అడ్మిషన్లు పొందగా ప్రస్తుత సంవత్సరంలో 95 మంది మాత్రమే చేరారు. కామేపల్లి కళాశాలలో గతేడాది 35 మంది చేరగా ఈ ఏడాది 26 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విస్తృత ప్రచారం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ఫలితాలు, ఎప్‌సెట్ కోచింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు.. ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాం. ఈ అంశాలన్నీ ప్రవేశాల పెంపునకు దోహదపడ్డాయి.
– రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి
‘జూనియర్’లో జోరు..