
టీచర్ చొరవతోనే కలెక్టర్ అయ్యా...
● గురుపూజోత్సవంలో కలెక్టర్ అనుదీప్ ● జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
ఖమ్మం సహకారనగర్: చిన్నతనంలో తనకు ఇంగ్లిష్ బోధించిన టీచర్ చూపించిన చొరవతోనే తాను కలెక్టర్ స్థాయికి ఎదిగానని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సమాజంలో చాలామంది జీవితాల్లో వెలుగు నింపే అవకాశం ఉపాధ్యాయులకు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లో గురుపూజోత్సవంలో భాగంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.శ్రీపాల్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి తో కలిసి కలెక్టర్ సన్మానించి మాట్లాడారు. కరోనా సమయాన ఆన్‌లైన్ బోధనతో పిల్లల విద్యా ప్రమాణాలు సగానికి పైగా పడిపోవడంతో ఉపాధ్యాయుల ప్రాధాన్యత అందరికీ తెలిసిందని చెప్పారు. తరగతి గదుల్లో డిజిటల్ క్లాస్ రూమ్ అదనపు సౌకర్యం మాత్రమేనని.. టీచర్లే కేంద్రంగా బోధన సాగితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉన్నందున, ఇదే స్ఫూర్తిని బోధనలో కొనసాగిస్తే మరిన్ని ఫలితాలు సాధించొచ్చని తెలిపారు. ఎమ్మెల్సీ పి.శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఉపాధ్యాయులకు సమస్యలు ఉన్నా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దారని చెప్పారు. అదనపు కలెక్టర్లు శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడగా జెడ్పీ సీఈఓ దీక్షారైనా, సీఎంఓ ప్రవీణ్‌కుమార్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.