
మిర్చి ధర ముందడుగు..
● రూ.350 నుంచి రూ.500 పెరుగుదల ● వివిధ రాష్ట్రాల్లో డిమాండ్‌తో ఫలితం
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధరలో స్వల్ప పెరుగుదల నమోదైంది. కొంతకాలంగా ధరలతో పోలిస్తే ప్రస్తుతం రూ.350 నుంచి రూ.500మేర పెరిగింది. మార్చి, ఏప్రిల్‌లో క్వింటా మిర్చికి రూ.13,500 నుంచి రూ.13,850మధ్యే పలకగా మే నెలలో రూ.13వేలు కూడా దాటలేదు. జూన్ ఆరంభంలో ఏసీ మిర్చికి రూ.14,200వరకు రాగా, ఆతర్వాత రూ.13వేలకు పడిపో యి నా ఈ నెలారంభం నుంచి పురోగతి కనిపించింది. ఏసీ మిర్చి తేజా రకం ధర రూ.13,350 నుంచి పెరుగుతూ 11వ తేదీన రూ.13,500కు చేరింది. సోమవారం మరో రూ.350 పెరిగి రూ.13,850గా నమోదైంది. నాన్ ఏసీ మిర్చి జూన్‌లో రూ. 12,500లోపే పలకగా, సోమవారం రూ.13,600కు చేరింది.
ఇతర రాష్ట్రాల్లో వినియోగంతో...
మిర్చి ధర దేశీయ మార్కెట్‌లోనే పెరుగుతుండడంతో ఇక్కడ కూడా ఫలితం కనిపిస్తోంది. యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తేజా రకం మిర్చి వినియోగం పెరగడం ఇందుకు కారణమని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. తేజా రకం మిర్చిని చైనా దేశానికి ఎగుమతి చేస్తున్నా ఈసారి ఆర్డర్లు రాలేదు. కానీ దేశీయంగా ఆర్డర్లతో ధరలో కదలిక రావడం రైతుల్లో ఆశలు నింపుతోంది. జిల్లాలోని 48 కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 48 లక్షల మిర్చి బస్తాలు, రైతుల ఇళ్లలో కూడా మిర్చి నిల్వ ఉండగా క్వింటాకు ధర రూ.15 వేల మార్క్ తాకితే అమ్మకాలు ఊపందుకునే అవకాశముందని భావిస్తున్నారు.