రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు | - | Sakshi
Sakshi News home page

రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు

Jul 15 2025 7:03 AM | Updated on Jul 15 2025 7:03 AM

రూ.లక

రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు

● మహిళా సంఘాలతో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటు ● కుటీర పరిశ్రమల ఏర్పాటుకు శిక్షణ ఇప్పిస్తాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

చింతకాని: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. చింతకాని మండల కేంద్రంలో సోమవా రం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఆయన ఇందిరా మహిళా శక్తి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో వడ్డీ లేని రుణాలను ఇవ్వకపోగా, తాము అధికారంలోకి రా గానే పునద్ధరించడమే కాక మొదటి ఏడాదే రూ. 21,632 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. అలాగే, సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలు సైతం మహిళా సంఘాలకు అప్పగించనున్నట్లు చెప్కాపరు. మధిర నియోజకవర్గంలోని నాలుగెకరాల్లో 2 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. కాగా, ప్రతీ నియోజకవర్గంలో మహిళలకు శిక్షణ ఇప్పించి కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేయిస్తామని వెల్లడించారు. ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వగా, పెట్రోల్‌ బంకులు, ఇసుక రీచ్‌ల నిర్వహణ కూడా వారికే అప్పగిస్తున్నామని తెలిపారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

నిరుపేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా, లబ్ధిదారులకు దశల వారీగా బిల్లులు ఇస్తున్నామని చెప్పారు. అలాగే, రేషన్‌కార్డులపై సన్నబియ్యం, రూ.500కే సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని, మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.6,632 కోట్లు వెచ్చించామని తెలిపారు. సెర్ప్‌ సీఈఓ డి.దివ్య మాట్లాడుతూ మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాల్లో 99 శాతం తిరిగి చెల్లిస్తున్నారని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు చీరలు ఇవ్వడానికి కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఈకార్యక్రమంలో మధిర నియోజకవర్గంలోని 4,590 మహిళా సంఘాలకు రూ.5.93 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కు, చింతకాని మండలానికి చెందిన 539 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, నియోజకవర్గానికి చెందిన మహిళా సంఘాలకు రూ.36.21 లక్షల బీమా చెక్కు, బోనకల్‌ మండలానికి చెందిన కిరణ్‌కుమార్‌కు రూ.10 లక్షల ప్రమాద బీమా చెక్కు భట్టివిక్రమార్క ఈ సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, పోలీస్‌ కమీషనర్‌ సునీల్‌దత్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీఎస్‌ఓ చందన్‌కుమార్‌, డీపీఓ ఆశాలత, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఎంహెచ్‌ఓ కళావతి బాయి, హౌసింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ కరుణాకర్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.

రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు1
1/1

రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement