
కొరవడుతున్న పర్యవేక్షణ
● ఉమ్మడి జిల్లాలో 600 పైగా ఆలయాలు ● ఏడాదికి రూ. 2లక్షలకు పైగా ఆదాయం వచ్చేవి 92.. ● ఈ దేవస్థానాల్లో 18 ఈఓ పోస్టులు.. ఉన్నది 11 మందే ● ఇన్‌చార్జ్‌లతో భక్తులకు తప్పని ఇక్కట్లు
పాల్వంచరూరల్: దేవాలయాల్లో భక్తుల సౌకర్యాలు, ఆలయ ఆస్తుల పరిరక్షణ, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన ఈఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇక్కట్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలోని అనేక ఆలయాల్లో ఈ సమస్య వేధిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 600 ఆలయాలు ఉండగా, ఇందులో ఏడాదికి రూ.2లక్షలు, ఆపైన ఆదాయం వచ్చే ఆలయాలు 92 ఉన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించి 18 ఈఓ పోస్టులు కేటాయించారు. అంటే ఒక్కో ఈఓ సుమారు ఐదు ఆలయాలను పర్యవేక్షించాలి. అయితే, ఈ 18లోనూ ప్రస్తుతం 11 మందే విధులు నిర్వరిస్తుండడంతో వీరిపై అదనపు భారం పడడమే కాక భక్తులకు కనీస సౌకర్యాలు అందడం లేదు.
పెద్ద ఆలయాలకూ దిక్కు లేదు..
ఉమ్మడి జిల్లాలో నిత్యం భక్తుల రద్దీ ఉండే పలు ఆలయాలకు కూడా రెగ్యులర్ ఈఓలు లేరు. భద్రాద్రి జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయం, కొత్తగూడెంలోని విజయ విఘ్నేశ్వరస్వామి, పాల్వంచలోని పెద్దమ్మతల్లి, భద్రాచలంలోని అభయాంజనేయస్వామి ఆలయాల్లో ఇన్‌చార్జ్ ఈఓలే విధులు నిర్వర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి, ఖమ్మం కమాన్‌బజార్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయం, ఖమ్మం రూరల్ మండలంలోని మారెమ్మగుడి వంటి పెద్ద ఆలయాలకు కూడా రెగ్యులర్ ఈఓలు లేరు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 11 మంది ఈఓలు ఉండగా, వారికి కేటాయించిన ఆలయాలతో పాటు ఆదాయం తక్కువగా ఉన్న ఇతర దేవాలయాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా వీరిపైనే పడుతున్నాయి.
ఒక్క అధికారి.. 17 ఆలయాలు
ఈఓలు పరిమితికి మించి ఆలయాలకు ఇన్‌చార్జ్ లుగా ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోంది. కొత్తగూడెంలోని దాసాంజనేయస్వామి ఆలయ ఈఓ శేషయ్య 17 దేవస్థానాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భద్రాద్రి జిల్లాలో ఏడు, ఖమ్మం జిల్లాలో పది ఉన్నాయి. పెద్దమ్మగుడి ఆలయ ఈఓ రజినీకుమారి ఇక్కడే ఇన్‌చార్జ్‌గా ఉండగా, ఈ దేవస్థానంతో పాటు పాల్వంచలోని భజన మందిరం, పాత పాల్వంచలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, కొత్తగూడెంలోని విఘ్నేశ్వరస్వామి ఆలయం, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని నీలాద్రీశ్వరస్వామి ఆలయాల బాధ్యతలూ చూస్తున్నారు. ఖమ్మంలోని ప్రసిద్ధ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనృసింహస్వామి ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు జమలాపురం, జీళ్లచెరువులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు మారెమ్మగుడికి కూడా ఇన్‌చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరు ఎక్కడా పూర్తిస్థాయిలో పని చేయలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన 18 పోస్టుల్లో ఖాళీగా ఏడు భర్తీ చేయడంతో పాటు అధిక ఆదాయం ఉన్న ఆలయాలకు ప్రత్యేకంగా ఈఓలను నియమించాలని భక్తులు కోరుతున్నారు.
అన్యాక్రాంతమవుతున్న ఆలయ భూములు..
ఉమ్మడి జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం 14,771 ఎకరాల భూములు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 4,865 ఎకరాలు ఉండగా 862 ఎకరాలు అన్యాక్రాంతమైంది. భద్రాద్రి జిల్లాలో 9,906 ఎకరాలకు గాను 1,039 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా.. ప్రత్యేకంగా ఈఓలు లేక సాధ్యపడడం లేదు.
పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు..
ఉమ్మడి జిల్లాకు 18 ఈఓ పోస్టులు ఉండగా, ఏడు భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం దేవాదాయ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించాం. అధికారులను నియమించగానే అవసరమైన
ఆలయాలకు కేటాయిస్తాం. అప్పటివరకు భక్తులకు ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తాం.
– వీరస్వామి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్