
కొణిజర్లలో ట్యాంక్‌ను పరిశీలిస్తున్న సురేంద్రమోహన్, అధికారులు
ప్రభుత్వ కార్యదర్శి సురేంద్రమోహన్
ఖమ్మంమయూరిసెంటర్/వైరా/కొణిజర్ల: ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని.. ఇందుకు అనుగుణంగా అధికారులు పర్యవేక్షించాలని ఉమ్మడి జిల్లా తాగునీటి సరఫరా పర్యవేక్షణ ప్రత్యేక అధికారి, ప్రభుత్వ కార్యదర్శి కె.సురేంద్రమోహన్ సూచించచారు. ఖమ్మం దానవాయిగూడెం ఫిల్టర్‌బెడ్ వద్ద నీటి నిల్వలను సోమవారం ఆయన అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పాలేరు జలాశయం నుంచి విడుదల చేసిన నీటిని తాగు అవసరాలకే ఉపయోగిస్తూ, ఎక్కడా వృథా కాకుండా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం రామన్నపేట, శాంతినగర్ పాఠశాలను తనిఖీ చేసి వసతులపై ఆరా తీసిన సురేంద్రమోహన్.. ఆతర్వాత లకారం ట్యాంక్ బండ్‌కు వెళ్లి నీటి నిల్వ ను పరిశీలించారు. కాగా, వైరాలో రిజర్వాయర్‌ను సైతం పరిశీలించగా, నిల్వ ఉన్న నీరు మరో 45 రోజుల వరకు సరిపోతుందని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. ఇక కొణిజర్ల మండలంలోని చిన్నగోపతి, కొణిజర్లలోనూ అదనపు కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పర్యటించిన సురేంద్రమోహన్ చిన్నగోపతి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని సౌకర్యాలు పరిశీలించారు. ఆపై పీహెచ్‌సీని తనిఖీ చేసి వడదెబ్బ నివారణ మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అక్కడే లక్ష లీటర్ల సామర్ధ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్‌ను పరిశీలించి నీరు సరఫరాపై ఆరాతీస్తుండగా. ఓ మహిళ నీటి సరఫరా సరిగా జరగడం లేదని తెలిపారు. దీంతో వెంటనే సమస్య పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరిని ఆదేశించారు. అసిస్టెంట్ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రంజిత్ కుమార్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌సీ సదాశివకుమార్, ఈఈ పుష్పలత, వివిధ శాఖల అధికారులు నర్సింహమూర్తి, నవీన్, మణిశంకర్, సతీష్‌కుమార్, చైతన్య కుమార్, తఫజల్ హుస్సేన్, ఏ.రోజారాణి, డాక్టర్ సైదులు, ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.