నక్షత్ర తాబేలు ప్రత్యక్షం | Sakshi
Sakshi News home page

నక్షత్ర తాబేలు ప్రత్యక్షం

Published Thu, Dec 21 2023 12:22 AM

- - Sakshi

సత్తుపల్లిరూరల్‌: అరుదైన నక్షత్ర తాబేలు సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం దర్శనమిచ్చింది. అటవీ అధికారులు ట్రెంచ్‌ పనులు చేస్తుండగా పొక్లయినర్‌ శబ్దానికి పొదల్లో నుంచి బయటకు వచ్చింది. దీనిని సత్తుపల్లి సెక్షన్‌ ఆఫీసర్‌ నర్సింహ గుర్తించి అదే దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలి పెట్టినట్లు తెలిపారు.

ఉరి వేసుకుని

వ్యక్తి ఆత్మహత్య

కామేపల్లి: ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం మండలంలోని పండితాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మగాని సాంబయ్య (54) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో బుధవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరి వేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య చంద్రమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాళం వేసి ఉన్న

ఇంట్లో చోరీ

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం నగరం బోనకల్లురోడ్డులోని శ్రీరాంనగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో రూ.2.50 లక్షల విలువైన సొత్తు చోరీకి గురైంది. బాధితుడు కంచిమర్తి శ్రీనివాసరావు కథనం ప్రకారం.. శ్రీరాంనగర్‌ 13వ వీధిలో ఉంటున్న శ్రీనివాసరావు కుటుంబం ఈ నెల 14న ముంబై వెళ్లింది. తిరిగి బుధవారం వచ్చిన వారికి ఇంటి తాళం పగులగొట్టి కనిపించింది. లొపలికెళ్లి చూడగా బీరువాలో దాచిన 3 తులాల బంగారం, 300 గ్రాముల వెండి, రూ.90 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఖానాపురం హవేలి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

పాము కాటుతో రైతు మృతి

సత్తుపల్లి: చెరుకుతోటలో పనిచేస్తున్న రైతును పాటు కాటు వేయగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని గంగారంలో చోటుచేసుకుంది. ఈ నెల 13న పఠాన్‌ నాగుల్‌మీరా (45) చెరుకుతోటలోని చెత్తను తగల పెడుతుండటంతో రక్తపింజర పాము కాటువేసింది. బాధితుడిని సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

ద్విచక్రవాహనాన్ని

ఢీకొట్టిన ట్రాలీ

కామేపల్లి: ద్విచక్రవాహనాన్ని ఆటో ట్రాలీ ఢీకొట్టడంతో యువకుడికి గాయాలైన ఘటన బుధవారం పండితాపురం బైపాస్‌ రోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీ పరిధి అబ్బాసుపురం గ్రామానికి చెందిన ధరావత్‌ శ్రీకాంత్‌ ద్విచక్రవాహనంపై పండితాపురం వైపు వెళ్తుండగా బైపాస్‌ రోడ్డు సమీపంలో ఆటో ట్రాలీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌ తలకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

విద్యుదాఘాతంతో

గేదె మృతి

నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తెగిపడి గేదె మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని మంగాపురంతండాకు చెందిన తేజావత్‌ అమర్యాకు చెందిన పాడి గేదైపె బుధవారం విద్యుత్‌ 11 కేవీ తీగలు గేదైపె తెగి పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ దాదాపు రూ.30 వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.

యువతి అదృశ్యం

పాల్వంచ: షాపింగ్‌మాల్‌లో పని నిమిత్తం వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయిందని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. పట్టణ పరిధిలోని నవభారత్‌ గాంధీనగర్‌కు చెందిన యువతి అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద గల ఓ షాపింగ్‌ మాల్‌లో పనిచేస్తోంది. బుధవారం యథావిధిగా పనినిమిత్తం ఇంటి నుంచి వెళ్లి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నక్షత్ర తాబేలు
1/3

నక్షత్ర తాబేలు

శ్రీకాంత్‌ని 108లో ఎక్కిస్తున్న దృశ్యం
2/3

శ్రీకాంత్‌ని 108లో ఎక్కిస్తున్న దృశ్యం

పఠాన్‌ నాగుల్‌మీరా (ఫైల్‌)
3/3

పఠాన్‌ నాగుల్‌మీరా (ఫైల్‌)

Advertisement
 
Advertisement