Telangana: Ponguleti Srinivas Reddy Fires On CM KCR - Sakshi
Sakshi News home page

పదునెక్కిన విమర్శలు.. పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారో?

Published Tue, Apr 11 2023 8:53 AM

Ponguleti Srinivas Reddy Fires On CM KCR - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ ఏడాది మొదటి నుంచే బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి విమర్శలు ఎక్కుపెట్టిన ఆయనపై చివరకు చర్యలు తీసుకున్నారు. కొత్తగూడెంలో ఆదివారం జరిగిన సభ ఇటు బీఆర్‌ఎస్‌, అటు పొంగులేటి శిబిరంలో కాక పెంచగా.. సస్పెన్షన్‌ వ్యవహారం మరింత వేడెక్కించింది. పొంగులేటితో పాటు కొత్తగూడెం వేదికను పంచుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై వేటు వేస్తూ బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యాన పొంగులేటి ఖమ్మంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తొమ్మిది నియోజకవర్గాల్లో భేటీలు పూర్తి
బీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి ఈ ఏడాది జనవరి 1వ తేదీన పార్టీపై ఉన్న అసమ్మతిని బయటపెట్టారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ విమర్శల దాడి పెంచారు. ఖమ్మం మినహా ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో భేటీలు పూర్తికాగా, కొన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇప్పటికే పొంగులేటి వెంట నడుస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులను బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయడంతో విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ఇదే సమయాన వైరా మున్సిపల్‌ చైర్మన్‌పై కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు.

2016 మే 4న టీఆర్‌ఎస్‌లోకి..
పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా అప్పటి ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2016 మే 4న టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా వెళ్లారు. సోమవారం పొంగులేటిని సస్పెండ్‌ చేయడంతో బీఆర్‌ఎస్‌లో దాదాపు ఏడేళ్ల ప్రయాణం ముగిసినట్లయింది. ఈ ప్రయాణం పొంగులేటికి రాజకీయంగా ఆశించిన స్థాయిలో కలిసి రాకపోగా, సిట్టింగ్‌ ఎంపీ అయి కూడా టికెట్‌ దక్కలేదు. చివరకు రాజ్యసభ స్థానం ఇస్తారని ఆశిస్తే నిరాశ ఎదురుకావడం.. అనుచర గణానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి కారణాలు ఆయనకు అసంతృప్తిని కలిగించాయి. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత పరాభవాలే ఎదురవుతాయన్న భావనతో ఆయన ముందుగానే దారి మార్చుకున్నట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది.

ఏ పార్టీలోకి వెళ్తారో ?
బీఆర్‌ఎస్‌ సస్పెన్షన్‌ నిర్ణయం ప్రకటించగానే శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు చేయడంతోపాటు ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గెలవరని, ఎవరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ సవాల్‌ విసిరారు. అయితే ఏదైనా పార్టీలో చేరడమా, సొంత పార్టీ పెట్టడమా అనే నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పడంతో పొంగులేటి తదుపరి రాజకీయ ప్రస్థానం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే మిగిలింది. కాగా, కొత్తగూడెం సభకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కావడం, త్వరలో మిగతా జిల్లాల్లో కూడా బీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులను కలుపుకుని సభలు పెడతామన్న పొంగులేటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

మిగిలింది ఖమ్మమే..
మూడున్నర నెలలుగా బీఆర్‌ఎస్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు సంధిస్తున్న పొంగులేటి.. ఆత్మీయ సమ్మేళనాలతో తన కేడర్‌ చేజారకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఖమ్మం సభ మాత్రమే మిగిలి ఉండటంతో ఎప్పుడు నిర్వహిస్తారు, ఆ భేటీలో ఏదైనా నిర్ణయం ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు పలు మండలాల్లో ఆయన అనుచరులు, ఆయన వెంట నడుస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు పొంగులేటిని సస్పెండ్‌ చేసినట్లు తెలియగానే రాజీనామా బాట పట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement