శివాజీనగర: ఎల్‌నినో దెబ్బకు కన్నడనాడు విలవిలలాడుతోంది, వర్షాలు లేక నదులు, వాగులు, వంకలు ఎండుముఖం పట్టాయి, పంటపొలాల దుస్థితి చెప్పనవసరం లేదు, తాగునీరు ఎలా? అనే దిగులు పట్టుకుంది, ఇలాంటి తరుణంలో కావేరీ జల నిర్వహణ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఆదేశం పులి మీద పుట్రలా పడింది. కర్ణాటక 15 రోజుల పాటు తమిళనాడుకు రోజూ 3,000 క్యూసెక్కులు ( సుమారు 4 టీఎంసీలు) కావేరీ నీటిని విడుదల చేయాలని సీడబ్ల్యూఎంఏ ఆదేశించింది. తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్న కర్ణాటకకు మరో పిడుగుపాటైందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తు.చ. తప్పకుండా పాటిస్తున్నా..
తమిళనాడుకు రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని సీడబ్ల్యూఎంఏ ఆదేశించగా, ఆ నీటిని 2,000 క్యూసెక్కులకు తగ్గించాలని రాష్ట్రం అభ్యర్థించింది. మండ్య, మైసూరు జిల్లాల్లోని కావేరీ పరీవాహక ప్రాంతాల్లో సుమారు 47 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించారు. అవి తీవ్రమైన అనావృష్టిని ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ, కర్ణాటక కావేరి కమిటీల అన్ని ఆదేశాలను కచ్చితంగా పాటిస్తోంది. తమిళనాడుకు ఈశాన్య రుతుపవనాల ద్వారా అధిక వర్షాలు కురిసే ప్రయోజనం ఉంది. దీనివల్ల నీటి లభ్యత బాగా పెరుగుతుంది. అయినప్పటికీ పదే పదే కర్ణాటక నుంచి కావేరి నీటినివ్వాలని డిమాండ్ చేస్తోందని విమర్శలున్నాయి.
తగ్గించాలని కోరతాం: మంత్రి
ఇన్‌ఫ్లో పడిపోవడంతో కేఆర్‌ఎస్, కబిని జలాశయాలు కటకటలాడుతున్నాయి. వాటి నుంచి గణనీయమైన మొత్తంలో నీటిని విడుదల చేయడం సాధ్యమయ్యేనా అనే సందిగ్ధంలో రాష్టముంది. బిలిగుండ్లులోకి రోజుకు విడుదల చేసే నీటి పరిమాణాన్ని 2,000 క్యూసెక్కులకు తగ్గించేలా వెసులుబాటు ఇవ్వాలని జలవనరుల శాఖ మంత్రి ఎన్.చెలువరాయస్వామి డిమాండ్ చేశారు.
తమిళనాడుకు 4 టీఎంసీల విడుదలకు సీడబ్ల్యూఎంఏ ఆదేశం
అనావృష్టితో అల్లాడుతున్న కన్నడనాడు
50 టీఎంసీలపై గురి
తమిళనాడు మెట్టూరు డ్యాంలో 55 టీఎంసీల నీరు ఉంది. ఈశాన్య రుతుపవనాల కాలంలో సుమారు 45 రోజుల పాటు సాగును కొనసాగించడానికి కర్ణాటక బిలిగుండ్లు ద్వారా 50.33 టీఎంసీల నీటిని ఇవ్వాలి. కానీ 34.32 టీఎంసీలే విడుదల చేసిందని తమిళనాడు ఆరోపిస్తోంది. మిగిలిపోయిన నీటితో పాటు ఈ నెల వాటాను విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలని తమిళనాడు సెప్టెంబర్‌లో అభ్యర్థించింది. దీనిని కర్ణాటక సుప్రీంకోర్టులో సవాల్ చేయగా విచారణలో ఉంది.


