సాక్షి, బెంగళూరు: నాపై, మంత్రులపై స్టింగ్ అపరేషన్ ప్రయత్నాలు జరిగాయి. దీని పితామహుడు ఎవరు? ఇందుకు ఆర్థిక వనరులు సమకూర్చింది ఎవరు. అంతా నాకు బాగా తెలుసు అంటూ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. గురువారం ఢిల్లీలో కర్ణాటక భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. స్టింగ్ ఆపరేషన్‌పై అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని, తాను ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నానని, ఊరికే తాను ఏమీ మాట్లాడనని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నింటికీ బదులిస్తానని చెప్పారు. స్టింగ్ ఆపరేషన్ కోసం కొందరు వ్యక్తులు తన వద్దకు వచ్చారని, తాను వారి ఫోటోలు విడుదల చేసేందుకు కూడా సిద్ధమన్నారు. స్టింగ్ ఆపరేషన్ చేసిన వారెవరో ప్రకటించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన సవాలును విలేకరులు ప్రస్తావించగా, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం దేనికి అని సీఎం ప్రశ్నించారు. నైస్ ప్రాజెక్టు కుమారస్వామి పాపాల్లో ఒక్కటని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు అసెంబ్లీలో వివరిస్తానని తెలిపారు. వీరి కుటుంబానికి అంత ఆస్తి ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు.
డైవర్షన్ కోసమే: కేంద్రమంత్రి కుమార
నైస్ ప్రాజెక్టులో అక్రమాలను సాక్ష్యాలతో సహా బయటపెట్టడంతో సీఎం డీకే శివకుమార్‌కు ఏమి చేయాలో తోచడం లేదని, అందుకే డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీలో విమర్శించారు. నైస్ అక్రమాలపై చర్చ జరగకూడదని స్టింగ్ ఆపరేషన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎంను కలిసేందుకు వచ్చే వారు ఫోన్ బయటే వదిలి వెళ్లాలని, ట్రాప్ చేసినవారిని ఎందుకు వదిలేశారని అన్నారు. గతంలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళిని ట్రాప్ చేసింది ఎవరని, మాజీ మంత్రి రాజణ్ణ ఎందుకు మౌనంగా ఉన్నారనేది అందరికీ తెలుసని విమర్శించారు.
ఎవరు చేయిస్తున్నారో తెలుసు
సీఎం డీకే శివకుమార్


