కొత్త బైక్‌లో కాటికి! | - | Sakshi
Sakshi News home page

కొత్త బైక్‌లో కాటికి!

Oct 9 2026 2:08 AM | Updated on Oct 9 2026 2:08 AM

● ఇద్దరు యువకుల మృతి

దొడ్డబళ్లాపురం: బెంగళూరులో కొత్త బైక్‌ కొనుక్కుని సొంతూరికి వెళ్తుండగా దారిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కొత్త బైక్‌ను ఊళ్లో బంధుమిత్రులకు చూపించి సంతోషంగా గడుపుదామనుకున్న వారి కల ఛిద్రమైంది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి వద్ద 9వ నం బరు జాతీయ రహదారిపై జరిగింది. బీదర్‌ తాలూకా యరనళ్లి గ్రామానికి చెందిన సాయికిరణ్‌ (25), నాగేశ్‌ (24), స్నేహితులు కాగా, సాయికిరణ్‌ బెంగళూరులో కొత్త బైక్‌ కొన్నాడు. ఇద్దరూ అదే బైక్‌లో సొంతూరికి బయల్దేరారు. సంగారెడ్డి వద్ద లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. కొంతసేపట్లో పిల్లలు వస్తారని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ఈ ఘోరం తెలిసి కుప్పకూలిపోయారు.

ప్రైవేటు బస్సు బూడిద

శివమొగ్గ: బెంగళూరు నుంచి శివమొగ్గ జిల్లాలోని సాగర్‌కు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు మంటలు చెలరేగి కాలిపోయింది. ఈ ఘటన గురువారం ఉదయం సాగర్‌ తాలూకా ఆనందపుర దగ్గర జరిగింది. బస్సులోని ఇద్దరు ప్రయాణికులు, డ్రైవర్‌, కండక్టర్‌లు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు వెళ్తుండగా పొగ రావడంతో డ్రైవర్‌, కండక్టర్‌ వెంటనే బస్సును నిలిపివేశారు. తరువాత ప్రయాణికులను హెచ్చరించి అందరూ దిగిపోయారు. కొంతసేపటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.

విమానం ఆలస్యంపై రచ్చ

దొడ్డబళ్లాపురం: సీఎం డీకే శివకుమార్‌ కోసం ఇండిగో విమానం ఆలస్యంగా బయల్దేరిందని కొందరు నెటిజన్లు విమర్శించారు. మంగళవారంనాడు రాత్రి 7:30 గంటలకు బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానం సుమారు 36 నిమిషాలు ఆలస్యంగా టేకాఫ్‌ తీసుకున్నట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్లలో నమోదైంది. సువర్ణసింగ్‌ అనే ప్రయాణికురాలు తాను అదే విమానంలో ఉన్నానని, సీఎం వచ్చే వరకూ విమానాన్ని నిలిపివేశారని, సిబ్బందే తనతో చెప్పారని పోస్టు చేసింది. నిర్వహణ అంశాలే కారణమంటూ, ఇండిగో సంస్థ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

బస్సులో వదిలేసిన

సొత్తు భద్రం

శివమొగ్గ: ఒక మహిళ ప్రైవేట్‌ బస్సులో డబ్బు, బంగారం, ఫోన్‌ ఉన్న బ్యాగ్‌ను మరచిపోయి వెళ్లిపోయింది. అదృష్టవశాత్తు సొత్తు ఆమెకు మళ్లీ చేరింది. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా, తరికెరె తాలూకాలోని హుల్సూరు గేట్‌కు చెందిన హసీనా 6న శివమొగ్గ నుంచి తరికెరెకు ప్రైవేట్‌ బస్సులో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో, ఆమె రూ.2 లక్షల విలువైన నగలు, రూ. 60వేల నగదు, మొబైల్‌ ఫోన్‌ ఉన్న బ్యాగ్‌ను బస్సులో మరిచిపోయింది. కొంతసేపటికి గుర్తుకు వచ్చి శివమొగ్గలోని దొడ్డపేట పోలీసులకు సమాచారం అందించింది. హెడ్‌ కానిస్టేబుల్‌ మంజప్ప, కానిస్టేబుల్‌ చంద్రనాయక్‌ ప్రైవేట్‌ బస్సు గురించి సమాచారం సేకరించి, బ్యాగ్‌ను స్వాధీనం చేసుకోగలిగారు. డబ్బులు, బంగారం భద్రంగా ఉన్నాయి, ఆ మహిళకు అప్పగించారు.

ఆన్‌లైన్‌ గేమ్స్‌, మిత్రుల

వేధింపులు..

● బాలుడు ఆత్మహత్య

దొడ్డబళ్లాపురం: ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడడానికి డబ్బులు ఇవ్వాలని స్నేహితులు వేధిస్తుండడంతో బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా పాండోమట్టి గ్రామంలో జరిగింది. టీఆర్‌ మనోజ్‌ (13)ను నలుగురు స్నేహితులు ఫ్రీ ఫైర్‌ గేమ్‌లో డబ్బులు వెయ్యాలని ఒత్తిడి చేసేవారు. అప్పటికి ఇంట్లో నుంచి రూ.4 లక్షలు ఎత్తుకెళ్లి వారికి ఇచ్చాడు. డబ్బులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు మనోజ్‌ను ప్రశ్నించారు. దీంతో మనోజ్‌ స్నేహితులకు ఇచ్చినట్టు చెప్పాడు. స్నేహితులు డబ్బులు తేవాలని కొట్టేవారని చెప్పాడన్నారు. ఈ పరిణామాలతో భయాందోళనకు గురైన బాలుడు ఇంట్లో ఉరివేసుకుని చనిపోయాడు. చెన్నగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement