యశవంతపుర: రోడ్డుపై వేగంగా వెళుతున్న ఇన్నోవా కారు టైర్ పేలి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన చిక్కమగళూరు నగరంలోని కోటెకెరె వద్ద జరిగింది. టైర్ పేలి అదుపు తప్పిన కారు మొదట కరెంటు స్తంభాన్ని ఢీకొని ఆపై చెరువులోకి పడిపోయింది. కరెంటు స్తంభం రెండు ముక్కలైంది. ఇంత ప్రమాదం జరిగినా కారులోని ముగ్గురు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. చెరువులో పడిన కారును చిక్కమగళూరు పోలీసులు క్రేన్‌తో పైకి లాగారు.
నటి ఫ్లెక్సీలపై ఫిర్యాదు
యశవంతపుర: కన్నడ డింపుల్ క్వీన్‌గా పేరున్న రచితారామ్ పుట్టినరోజు కావడంతో బెంగళూరు రాజరాజేశ్వరినగర వీధుల్లో ఆమె ఫ్లెక్సీలు అనేకం వెలిశాయి. మామూలుగా బెంగళూరులో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడానికి అనుమతులు లేవు. ఎవరైనా అనధికారికంగా కడితే పాలికే అధికారులు తొలగించి, జరిమానా విధించాలి. కానీ ఏమాత్రం భయం లేకుండా ఆమె అభిమానుల పేర్లతో వందలాదిగా ఫ్లెక్సీలు, కటౌట్లు కూడా పెట్టడం గమనార్హం. ఆర్‌ఆర్ నగర పూర్తిగా రచితా బ్యానర్లతో నిండిపోవటంతో కొందరు పర్యావరణవాదులు నగరాభివృద్ధి మంత్రి కృష్ణబైరేగౌడకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై తక్షణం జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
నంజన్నకు
రూ1.10 కోట్ల ఆదాయం
మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన, కపిలా నది ఒడ్డున వెలసిన నంజనగూడులోని శ్రీ నంజుండేశ్వర (శ్రీకంఠేశ్వర) ఆలయానికి హుండీ కానుకల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. హుండీలను లెక్కించగా నగదు రూపంలో రూ.1.10 కోట్లు సమకూరాయి. అదనంగా, 14 గ్రాముల బంగారం, 1 కేజీ 200 గ్రాముల వెండి, వివిధ దేశాలకు చెందిన 14 కరెన్సీ నోట్లు లభించాయని ఈఓ కృష్ణ తెలిపారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది, బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది పాల్గొన్నారు.
సీఎంపై నేడు ఈసీకి
బీజేపీ ఫిర్యాదు
దొడ్డబళ్లాపురం: ఎస్‌ఐఆర్ ప్రక్రియ మీద రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య యుద్ధం కొనసాగుతోంది. బైఠాయింపులు, ఆరోపణలు తీవ్రతరమయ్యాయి. బీజేపీ నాయకులు సోమవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి సీఎం డీకే శివకుమార్, మంత్రులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అలాగే బళ్లారిలో కూడా భారీ ధర్నాకు బీజేపీ పిలుపునిచ్చింది. ఫారం–7 దరఖాస్తులు ఇచ్చి ఓట్లను తీసేయిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి వేధిస్తోందని, తక్షణం కేసులను రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. తమ తమ అంశాలపై ఇరు పార్టీలు పోరాటాన్ని ముమ్మరం చేయబోతున్నట్లు సమాచారం.
శాండల్‌వుడ్‌తో సింగీతం అనుబంధం
శివాజీనగర: వైవిధ్యభరితమైన సినిమాలకు ప్రాణం పోసిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయగా, శాండల్‌వుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. కన్నడ చిత్ర పరిశ్రమతోనూ సింగీతానికి అనుబంధం పెనవేసుకుంది. ఆనంద్ సినిమా ద్వారా హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ కథానాయకునిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్ర దర్శకుడు సింగీతమే కావడం విశేషం. కన్నడ సూపర్‌స్టార్ కంఠీరవ రాజ్‌కుమార్‌తో వరుసగా చల్యువ మొదగలు, హాలుటు జేను, భాగ్యద లక్ష్మి బారమ్మ, టూ స్టార్స్, శ్రవణ్ బంటు, సాయిరంగద వంటి అనేక ప్రసిద్ధ చిత్రాలకు సింగీతం దర్శకత్వం వహించారు. రాఘవేంద్ర రాజ్‌కుమార్ నటించిన చిరంజీవి సుధాకర్, జగదీష్ నటించిన మేకప్ చిత్రాలకు కూడా దర్శకులు ఆయనే.


