రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ నుంచి ఆయకట్టు చివరి భూములకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సింధనూరులో ఆందోళన చేపట్టారు. శనివారం రాత్రి గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ, మాజీ ఎంపీ విరూపాక్షప్ప మాట్లాడుతూ.. 32, 36వ ఉపకాలువలకు నీటి సరఫరా నిలిపివేయడాన్ని ఖండించారు. తుంగభద్ర ఎడమ కాలువల్లో నీటి సామర్థ్యాన్ని తెలిపే గేజ్‌ల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా అధికారి పూవిత రైతులు, నాయకులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సుమారు 69 వేల ఎకరాలకు నీరందించేందుకు 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాలువల పైభాగంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పైపులను తొలగించాలని కోరారు. 36వ ఉపకాలువను మూసివేయడంతో ఆగ్రహించిన కొందరు రైతులు గేట్లను తొలగించేందుకు ప్రయత్నించగా పోలీసులు, అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 33 మంది రైతులపై కేసులు నమోదు చేశారు.


