కోలారు: దేవస్థానంలో పూజలు చేసి వస్తుండగా విధి వక్రించడంతో కుటుంబంలో విషాదం సంభవించింది. బెంగళూరు– చైన్నె ఎక్స్‌ప్రెస్ హైవేపై వరుసగా ప్రమాదాలు కొనసాగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం కారు పల్టీలు కొట్టి పూణెకు చెందిన నలుగురు చనిపోవడం తెలిసిందే. ఇంతలో శనివారం రాత్రి జరిగిన మరో కారు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.
శ్రీకాళహస్తికి వెళ్లి వస్తుండగా
బెంగళూరు రామాపురకు చెందిన మేఘన (41), కారు డ్రైవర్ హేమంత్ (32), మరో ఐదుమంది షణ్ముగ (53), పూజా (27), రాజేష్ (29), బాబు (31), విజయలక్ష్మి (24) కారులో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో బంగారుపేట తాలూకా కుప్పనహళ్లి గ్రామం వద్ద హైవేలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. కారు పూర్తిగా నుజ్జయింది. మేఘన, డ్రైవరు రాజేష్ అక్కడే మరణించగా, మిగతా 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బంగారుపేట పోలీసులు, స్థానికులు కలిసి మృతదేహాలను, బాధితులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. బంగారుపేట ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం బెంగుళూరుకు పంపించారు.
డ్రైవరు, మహిళ దుర్మరణం
ఐదుగురికి తీవ్రగాయాలు
కోలారు జిల్లాలో విషాద ఘటన


