రాయచూరు రూరల్: జిల్లాలోని రాయచూరు–హునగుంద–బెళగావి జాతీయ రహదారి 748ఏ పనుల విషయంలో అధికారులు అలసత్వం వహించకూడదని మాజీ మంత్రి బోసురాజ్ సూచించారు. శనివారం సాయంత్రం హణగి, కవితాళ, సిరవార మధ్య జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. పనుల్లో నిర్లక్ష్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతమాల పథకంలో భాగంగా చేపట్టిన రాయచూరు–బెళగావి రహదారి పనుల్లో నాణ్యత లోపించిందని ఆరోపించారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారి నిర్మాణాల విషయంలో లోపాలను సరిచేయకుండా అశాసీ్త్రయంగా నిర్మాణాలు చేపట్టడం తగదన్నారు. రహదారులను విస్తరించి, మురుగునీటి కాలువలను చిన్నవిగా నిర్మించడం వల్ల వర్షాకాలంలో నీరు సక్రమంగా ప్రవహించక ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా మురుగునీటి కాలువలు నిర్మించాలని సూచించారు.


