హొసపేటె: కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ (శివన్న) తన తాజా చిత్రం బైల్ ప్రమోషన్‌లో భాగంగా శనివారం రాత్రి హొసపేటకు విచ్చేశారు. శివన్న, నటి సంజనా ఆనంద్‌తో కలిసి దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ (అప్పు) విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. శివన్నపై అభిమానులు పూలవర్షం కురిపించారు. కన్నడ నటీనటులు రావడంతో హోసపేటెలో పండుగ వాతావరణం నెలకొంది. బైల్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా శివన్న హోసపేటెకు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో విజయనగర జిల్లా డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ అభిమానుల సంఘం అధ్యక్షుడు కిచ్చడి విశ్వ తదితరులు పాల్గొన్నారు.


