రాయచూరు రూరల్: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా భీకర కరువు పరిస్థితులు దాపురించాయి. ఆదివారం రాయచూరు, యాదగిరి జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంట నష్టం, తీవ్రమైన కరువు పరిస్థితులను అంచనా వేయడానికి కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అజిత్ కుమార్ సాహు నేతృత్వంలో వచ్చిన ఈ ఉన్నత స్థాయి బృందం వివిధ ఉప–బృందాలుగా విడిపోయింది. ఇందులో భాగంగా ఉత్తర కర్ణాటక పరిధిలోని యాదగిరి, రాయచూరు, బాగల్‌కోట్, కొప్పళ జిల్లాల పర్యటన బాధ్యతలను డాక్టర్ మ్యాన్ సింగ్ నేతృత్వంలోని మూడవ ఉప–బృందం పర్యవేక్షించింది. ఈ కేంద్ర బృందం కరువు బారిన పడిన పలు గ్రామాలను సందర్శించి, ఎండిపోయిన పంటలను ప్రత్యక్షంగా పరిశీలించింది. తీవ్రమైన పొడి వాతావరణం వల్ల రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టపోయిన పంటల వివరాలను స్థానిక రైతులు, అధికారులను అడిగి తెలుసుకుంది. యాదగిరి జిల్లా శహపుర తాలూకా గుండళ్లిలో రైతు శరణప్ప సాగు చేసిన పత్తి పంటను పరిశీలించారు. వర్షాల కొరతతో ఈసారి పత్తి ఎకరాకు 1.5 క్వింటాళ్లు, వరి ఎకరాకు 10 బస్తాలు, మిరప ఎకరాకు 2 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. గతంలో పత్తి ఎకరాకు 15 క్వింటాళ్లు, వరి 35 బస్తాలు, మిరప 25 క్విటాళ్ల దిగుబడి వచ్చిందని గుర్తు చేశారు. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలుకా పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను తెలియజేశారు. అనంతరం దేవదుర్గ తాలూకా మసరకల్, అరికెర, గణేకల్‌లో వీబీజీరామ్‌జీ పనులను పర్యవేక్షించారు. రాయచూరు తాలుకా మురాన్ పురలో పశుగ్రాసం కిట్లను పరిశీలించారు. మస్కి తాలుకా కోట్నేకల్, లింగసూగురు తాలుకా సజ్జాపూర్‌లో రైతులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ కార్యదర్శి గిరీష్, జిల్లా అధికారిణి పూవిత, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఈశ్వర్ కుమార్ కాందూ, వ్యవసాయశాఖ అధికారి ప్రకాష్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.
నేడు విజయనగర జిల్లాలో పర్యటన
హొసపేటె: విజయనగర జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర కరువు అధ్యయన బృందం సోమవారం విజయనగర జిల్లాలో పర్యటించనుంది. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదైన జిల్లాల్లో విజయనగర కూడా ఉంది. కేంద్ర బృందం ఉదయం 9:15 గంటలకు హరపనహళ్లి తాలూకాలోని దుగ్గవతి గ్రామం, 9:45 గంటలకు నీల్‌గుండ్ గ్రామాలను సందర్శించనుంది. అక్కడ వీబీజీ రామ్‌జీ యోజన కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలిస్తుంది. ఉదయం 11 గంటలకు మైదూరు గ్రామంలో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఉల్లి పంటను పరిశీలించి పంట నష్టం అంచనా వేస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు హడగలి తాలూకాలోని ఇటగి గ్రామాన్ని సందర్శించి మొక్కజొన్న, ఉల్లి పంటల నష్టం, చెరువుల పునరుద్ధరణ పనులు, కూలీల పరిస్థితిపై సమీక్ష చేయనున్నారు. వాస్తవ పరిస్థితులను బృందం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ కవితా మన్నికేరి తెలిపారు.
మసరకల్‌లో ఎండిపోయిన మిరప పంటను పరిశీలిస్తున్న అధికారులు విజయనగర జిల్లాలో మొక్కజొన్న పంటను మేకలకు వదిలేసిన దృశ్యం
రాయచూరు, యాదగరి జిల్లాలో
కరువు బృందం పర్యటన
క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన
దిగుబడి లేదని అధికారులతో
మొరపెట్టుకున్న రైతులు


