రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ద్వారా ఆయకట్టు పరిధిలోని చివరి భూములకు సమానంగా నీటిని విడుదల చేయాలని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ డిమాండ్ చేశారు. సింధనూరు, మస్కి, మాన్వి ప్రాంతాల్లో పైభాగాన నీటిని అధికంగా విడుదల చేయడం వల్ల ఆయకట్టు చివరి భూములైన రాయచూరు తాలూకాలోని రైతులకు సరిపడా నీరు అందడం లేదని తెలిపారు. మిరప, పత్తి, వరి పంటలకు నీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆయకట్టు చివరి భూములకు కూడా సమానంగా నీరు అందేలా జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాలువల పైభాగంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పైపులను తొలగించాలని సూచించారు. 36వ ఉపకాలువను మూసివేసి దిగువ ప్రాంత రైతులకు నీరు చేరేలా చూడాలన్నారు. కాలువల వద్ద గేజ్ నిర్వహణను సక్రమంగా చేపడితే నీటిని నియంత్రిత పద్ధతిలో విడుదల చేసి ఆయకట్టు చివరి భూములకు కూడా నీరు అందించవచ్చని పేర్కొన్నారు.
అంబాభవానీ
విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం
రాయచూరు రూరల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భంగీకుంటలో అంబాభవానీ విగ్రహ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. గౌలి సమాజం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పంపాపతి శాస్త్రి, శోభా, శ్యామ్, యల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
పూడికతీత పనుల పరిశీలన
రాయచూరు రూరల్: కవితాళ పరిధిలోని వడవాటి శాఖ 9ఏ కాలువ మరమ్మతు, పూడికతీత పనులను మాజీ మంత్రి బోసురాజ్ పరిశీలించారు. నారాయణపుర కుడి కాలువ పరిధిలోని కవితాళ, కలంగేర, గోలదిన్నె, చిక్కబాదరదిన్నె, హణిగి, పాతాపుర, ఎన్‌ఆర్‌బీసీ కుడి కాలువ పూడిక పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయకట్టు చివరి భూములకు సైతం సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలువల మరమ్మతులు, పూడికతీత పనుల పురోగతిపై అధికారులతో చర్చిస్తున్నామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి
సాక్షి, బళ్లారి: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారిపోయాయి. శారీరక శ్రమ లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని 13వ వార్డు పరిధిలో మిల్లర్‌పేట నారప్ప వీధిలో జిల్లా బీజేపీ కార్యదర్శి జనజాగృతి సంఘం, ఆటో డ్రైవర్ల సంఘం జిల్లాధ్యక్షుడు హుండేకర్ రాజేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాధులను నయం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సుందర్, డాక్టర్ అరుణ రావు, డాక్టర్ రేణుకా మంజునాథ్, డాక్టర్ జగదీశ్, డాక్టర్ అభిషేక్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ అశ్విని, డాక్టర్ రమేష్, డాక్టర్ సంగీత, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ ప్రణిత తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
హుబ్లీ: బైక్ అదుపుతప్పడంతో కిందపడిన యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి ధార్వాడ కేలగేరి రోడ్డు సాయిమందిరం వద్ద చోటు చేసుకుంది. శ్రీనగర నివాసి అభినవ సాంబ్రణి అనే యువకుడికి ఉద్యోగం రావడంతో శనివారం రాత్రి స్నేహితులకు విందు ఇచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ధార్వాడ కేలగేరి రోడ్డు సాయిమందిరం వద్ద బైక్ అదుపుతప్పి పక్కన ఉన్న డ్రైనేజీలోకి పడిపోయాడు. బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మార్నింగ్ వాక్ వెళ్లిన వారు ఈ ప్రమాద దృశ్యాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధార్వాడ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


