బళ్లారి టౌన్: ‘సర్’ అక్రమాలపై ప్రశ్నిస్తే బీజేపీ నాయకులపై కేసులు పెడతారా? అని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులను నిరసిస్తూ సోమవారం బ్రూస్‌పేట్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టి ముట్టడిస్తామని తెలిపారు. ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 7,561 ఓట్లపై అభ్యంతరాలు తెలిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని.. పేర్లను డిలీట్ చేయాలని చెప్పలేదని స్పష్టం చేశారు. పాలికె కమిషనర్ డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని 93,000 నకిలీ ఓట్లు ఉన్నాయని గతంలోనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. కంప్లి నియోజకవర్గంలో బూత్–49లో రేష్మా భాను పేరుతో 19 చోట్ల ఓటుహక్కు ఉందని.. బళ్లారి నగరంలో బూత్ నంబర్–82లో అయుబ్ బాషా, 183లో రాజేశ్వరి అనే పేరుతో సంజీవరాణికోటలో పార్వతమ్మ అనే పేరుతో 12 చోట్ల ఓట్లు ఉండటంతో ప్రశ్నించామన్నారు. పాలికె ప్రతిపక్ష నేత శ్రీనివాస్ మోత్కర్‌పై కేసులు బనాయించడం చూస్తుంటే వారికి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఖాయం
విధాన పరిషత్ ఈశాన్య ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఎన్‌డీఏ అభ్యర్థి శశీల్ జి.నమోషి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనిల్ నాయుడు, జేడీఎస్ అధ్యక్షుడు మీనాళ్లి తాయణ్ణ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3,302 ఓటర్లు ఉండగా.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 15 మందితో బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నేతలు శ్రీనివాస్ మోత్కర్, రామలింగప్ప, హనుమంతప్ప, గురులింగన గౌడ, దివాకర్, మల్లన గౌడ, మారుతీ ప్రసాద్ పాల్గొన్నారు.


