బళ్లారి అర్బన్: తుంగభద్ర జలాశయం నుంచి హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసి, పంటలు కాపాడేందుకు చొరవ తీసుకోవాలని తుంగభద్ర రైతు సంఘం బళ్లారి జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం గౌడ కోరారు. ఆదివారం బళ్లారి రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బీ.నాగేంద్రను కలసి వినతిపత్రం అందజేశారు. తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం సుమారు 68 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. తాగు నీరు, ఆవిరి నష్టం డెడ్ స్టోరేజ్ తదితర అవసరాలకు నీటిని కేటాయించినప్పటికి వ్యవసాయానికి 50 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. నవంబర్ 30 వరకు రోజూ 9,500 క్యూసెకుల నీటిని విడుదల చేసినా సుమారు 46 టీఎంసీల నీరు ఖర్చు అవుతుందన్నారు. డిసెంబర్‌లో హెచ్‌ఎల్‌సీ కాలువకు మరో టీఎంసీ నీటిని విడుదల చేస్తే మిరప తదితర పంటలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కంప్లి, సిరుగుప్ప, సండూరు, బళ్లారి ఎమ్మెల్యేలతో కలిసి తుంగభద్ర జలాశయాన్ని సందర్శించాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సంఘం ప్రతినిధులు శ్రీధర్ గౌడ, సత్యనారాయణ, బలరామ్, గంగావతి వీరేష్, డీ.శివయ్య, జాలిహాల్ శ్రీధర్ గౌడ పాల్గొన్నారు.


