రాయచూరు రూరల్: కలబురగి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం (అన్న భాగ్య పథకం) రవాణా చేస్తున్న వాహనాన్ని లంచం తీసుకుని వదిలేసిన కేసులో ఆలంద్ సర్కిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) శరణబసప్ప కోడ్లాతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాలు ఇలా.. సెప్టెంబర్ 27వ తేదీన అన్న భాగ్య పథకం కింద పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారని ఒక అజ్ఞాత వ్యక్తి 112 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి తెలియజేశాడు. దాడి చేసిన పోలీసులు అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న పీడీఎస్ (రేషన్) బియ్యం లారీని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా లంచం తీసుకుని వాహనాన్ని, నిందితులను విడిచిపెట్టారని సమాచారం. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు వచ్చాయి. కలబురగి ఎస్పీ అంతర్గత విచారణకు ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి అక్రమాలు నిజమేనని తేలడంతో ఆలంద్ సర్కిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) శరణబసప్ప కోడ్లాను ఈశాన్య రేంజ్ ఐజీపీ శంతను సిన్హా సస్పెండ్ చేశారు. కానిస్టేబుళ్లు హనమంత్, మల్లికార్జున్, సయబన్నలను సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అడ్డురూ శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు.
లంచం ఆరోపణపలపై సస్పెండ్


