బనశంకరి/యశవంతపుర: ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో 6 మంది కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరులోని నాయండహళ్లిలో చంద్రాలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రాయచూరు కు చెందిన కూలికార్మికుడు కరిలింగప్ప(40) కుటుంబం వినాయకలేఔట్‌లో బాడుగ ఇంట్లో ఉంటోంది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. కరిలింగప్ప, భార్య లక్ష్మమ్మ (43), కుమార్తె చైత్ర (11), కుమారుడు బసవనగౌడ (9), కవల పిల్లలైన గీతా, గిరిజ (3)కు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. స్థానికులు వారిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. లక్ష్మమ్మకు 70 శాతం, కరిలింగప్పకు 45 శాతం కాలిన గాయాలు కావడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పిల్లల ఆరోగ్యం కూడా అలాగే ఉన్నట్లు సమాచారం. భారీ శబ్ధంతో విస్ఫోటం సంభవించడంతో స్థానికులు ఏమైందోనని భయాందోళనకు గురయ్యారు.
ఎలా జరిగింది?
కరిలింగప్ప పొద్దున్నే టీ కోసం స్టవ్ వెలిగిస్తుండగా గ్యాస్ లీకై పేలుడు జరిగినట్లు అనుమానాలున్నాయి. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఇంటి గోడలు చీలిపోయాయి. ఇరుగుపొరుగువారు మంటల్లో చిక్కుకున్న కుటుంబసభ్యులను కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించారు. పొట్టకూటి కోసం వచ్చి ప్రమాదంలో చిక్కుకున్నారని ఇరుగుపొరుగు ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రా లేఔట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వంట చేస్తుండగా విస్ఫోటం
తల్లిదండ్రులు, నలుగురు పిల్లలకు
తీవ్రగాయాలు
బెంగళూరు చంద్రాలేఔట్‌లో ఘోరం


