మైసూరు: మైసూరు దసరా మహోత్సవాల కోసం నగరంలో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ దీపాలంకరణ చట్రం హఠాత్తుగా నేలకొరిగింది. మైసూరు గన్‌హౌజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ఇనుప గొట్టాల కటౌట్ విద్యార్థులను తీసుకెళుతున్న టీటీ వాహనంపై పడింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కొన్ని గంటల క్రితమే ఏర్పాటు చేసిన కటౌట్ నేలమట్టం కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాసిరకంగా నిర్మించడమే కారణమని ఆరోపణలున్నాయి. కాంట్రాక్టరు, అధికారులు హడావుడిగా పనులు చేస్తున్నారని, వారే బాధ్యత వహించాలని ప్రజలు ఆరోపించారు. దసరా వేళలో లక్షలాది మంది పర్యాటకు సందర్శించే సమయంలో ఇలాంటి నాణ్యత లేని పనుల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కటౌట్ కూలిపోవడానికి కారణమైన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.
ఫారం–7లతో ఎవరినీ
తీసేయలేదు: ఈసీ
బనశంకరి: రాష్ట్రంలో 84,900 నమూనా 7 దరఖాస్తులు స్వీకరించామని, కానీ ఇంకా ఎవరిపేర్లు తొలగించలేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈసీ ఆఫీసు ముందు సీఎం, మంత్రులు ధర్నా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వీ.అన్బుకుమార్ స్పందిస్తూ, తప్పుడు ఫారం–7లతో ఫిర్యాదు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎవరి పేర్లు తీసేయలేదన్నారు. జూన్ 16 నుంచి అక్టోబరు 1 వరకు మొత్తం 84,900 ఫారం– 7లను స్వీకరించారు. ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు చేర్చడానికి వీటిలో ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఆ ఫారాలపై అధికారులు విచారించి, అభ్యంతరాలు తెలిపిన వ్యక్తికి నోటీస్ జారీచేస్తారు, ప్రత్యక్ష విచారణ తరువాతే జాబితా నుంచి పేర్లు తొలగిస్తారన్నారు.
కేంద్రమా.. ఆదుకో
● కరువు సాయానికి ఖర్గే వినతి
శివాజీనగర: కర్ణాటకలో తీవ్ర కరువు పరిస్థితి నెలకొంది, తక్షణం సహాయం అందించాలి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సెప్టెంబర్ వరకు కర్ణాటకలో 58 శాతం లోటు వర్షపాతం నమోదైంది, భారీ పంట నష్టం కారణంగా లక్షలాది రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని తెలిపారు. కర్ణాటకకు ఎన్‌డీఆర్‌ఎఫ్–ఎస్‌డీఆర్‌ఎఫ్ నిబంధనల రూ.3,705 కోట్ల సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కరువు కారణంగా రాష్ట్రానికి రూ.18,748 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. పాత 2015–16 వ్యవసాయ గణన ఆధారంగా కాకుండా, నవీకరించిన భూ రికార్డుల ఆధారంగా చిన్న, సన్నకారు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. 31 లక్షలకు పైగా రైతు కుటుంబాల దుస్థితిని చూడాలని, రాజకీయాలకు అతీతంగా తక్షణమే సహాయాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అభ్యర్థనను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కూడా పంపినట్లు ఖర్గే తెలిపారు.


