● బెళగావి హత్య కేసులో మరో విషాదం
దొడ్డబళ్లాపురం: ఉన్నంతలో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆమె కాపురం బాగుండాలని దేవుళ్లను ప్రార్థించారు. కానీ కూతురు మాత్రం ఖతర్నాక్‌గా మారింది. భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తనే పరలోకానికి పంపింది. ఈ సంఘటనతో ఆమె, ప్రియుడు కటకటాల్లో ఉన్నారు. బెళగావి జిల్లా హుక్కేరి వద్ద అనైతిక బంధం, రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త, రిటైర్డు జవాన్ సందీప్ మంజరగి (46) ని సైలెన్‌లో విషం ఎక్కించి హతమార్చిన భార్య సుమ కేసులో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ పరిణామాలతో సమాజంలో పరువు పోయిందని తీవ్ర మనోవేదనకు గురైన సుమ తల్లి మహాదేవి (57) ఆత్మహత్య చేసుకుంది. కూతురి నిర్వాకం గురించి ముమ్మరంగా ప్రచారం సాగుతుండడం చూసిన తల్లి ఆ రోజు ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. తలెత్తుకోలేకపోతున్నామని కుంగిపోయింది. శనివారంనాడు హుక్కేరి తాలూకా ఘోడ గేరి గ్రామంలోని ఇంట్లో మహాదేవి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
గజ దాడి.. ఇద్దరు అటవీ
సిబ్బందికి తీవ్రగాయాలు
శివాజీనగర: భద్రా పులి అభయారణ్యంలో గస్తీ తిరుగున్న అటవీ వాచర్స్‌పై ఏనుగు దాడిచేయడంతో గాయపడ్డారు. చిక్కమగళూరు జిల్లా ఎన్.ఆర్.పుర తాలూకాలోని హెబ్బె వన్యజీవి ప్రాంతంలో ఇది జరిగింది. భద్రా హిన్నీరు ప్రదేశంలో ఉంటున్న 10కి పైగా అడవి ఏనుగులు తిరుగుతుంటాయి. ఎన్‌ఆర్ పుర పట్టణానికి దగ్గరలోనే ఉంటాయి. దీంతో వాచర్స్ హరీశ్, బసవరాజ్ ఏనుగుల సంచారంపై నిఘా పెట్టారు. శుక్రవారం సాయంత్రం ఎన్‌ఆర్ పురం తాలూకా కల్లుకువె వద్ద అడవిలో తిరుగుతుండగా ఏనుగు దాడి చేసింది. ఇద్దరినీ తొండంతో కొట్టి కాళ్లతో తొక్కింది. హరీశ్ వెన్నెముక విరిగింది. బసవరాజ్ చేయి కాలు విరిగాయి. వెనుక వస్తున్న వాచర్స్ ఏనుగును అదిలించి బాధితులను శివమొగ్గ మెగ్గాన్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకై మంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
విద్యుత్ ఉద్యోగుల ధర్నా
మండ్య: రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థలో ప్రైవేటు కంపెనీలకు చోటివ్వరాదంటూ, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్‌కు అనుమతి ఇవ్వరాదని కోరుతూ విద్యుత్ ప్రసార మండలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం నగరంలో ధర్నా చేశారు. డివిజన్ కార్యాలయం ఎదుట గుమికూడిన ఉద్యోగులు నినాదాలు చేస్తూ బందీగౌడ బడావణెలోని ఎమ్మెల్యే రవికుమార్ నివాసానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. కార్యనిర్వాహక ఇంజినీర్ అనితాబాయి, పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
రెండు లారీలు ఢీ, దగ్ధం
శివాజీనగర: ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి వచ్చిన పాల ట్యాంకర్ ఢీకొంది, ఈ ప్రమాదంలో రెండు లారీలు మంటల్లో చిక్కుకోవడంతో అటు ఇటు ట్రాపిక్ నిలిచిపోయింది. ఈ ఘటన బెళగావి జిల్లాలోని ఎం.కే.హుబ్లీ పట్టణం వద్ద పూణె–బెంగళూరు రహదారిపై జరిగింది. శనివారం తెల్లవారుజామున మొక్కజొన్నల లారీ, పాల ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. వెంటనే రెండు లారీల్లో నిప్పంటుకొని మంటల ఉవ్వెత్తున రేగాయి. రెండు వాహనాల్లోని డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిరంతరం రద్దీగా ఉండే ఈ హైవేలో వాహన సంచారం బందయింది. స్థానిక ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో లక్షలాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. కిత్తూరు పోలీసులు విచారణ చేపట్టారు.
మీటర్ వడ్డీ.. తీసింది ఊపిరి
తుమకూరు: తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా, భక్తరహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొడ్డమాలవాడి గొల్లరహట్టి గ్రామంలో హరికథ దాసప్పగా పనిచేస్తున్న చిక్కన్న (38) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దొడ్డమాలవాడి ప్రభుత్వ మోడల్ ఉన్నత ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు మమత వద్ద ఆయన రూ.3 లక్షలు మీటర్ వడ్డీకి రుణం తీసుకున్నాడు. 10 నుంచి 30 శాతం వడ్డీతో కంతులు కడుతున్నాడు. అయితే తనను మూడేళ్లుగా ఆధిక వడ్డీ కోసం వేధిస్తున్నారని, తన మరణానికి వారి వేదింపులు కారణమని బంధువులు, స్నేహితులకు వాట్సాప్‌లో సందేశం పంపి, శనివారం ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. కుణిగల్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.


