సాక్షి,బళ్లారి: డ్రగ్స్ రహిత బళ్లారిని చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని జిల్లా ఎస్‌పీ సుమన్ పన్నేకర్ పిలుపునిచ్చారు. ఆమె శనివారం మాదక ద్రవ్యాల నివారణకు సంబంధించి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ చేపట్టారు. ఎస్‌సీసీ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, యువజన సంఘాలు, పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు.
డ్రగ్స్ విక్రేతలపై కఠిన చర్యలు
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా అమ్మినా, కొనుగోలు చేసినా అలాంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించి, బళ్లారిలో డ్రగ్స్ రహిత సమాజం నిర్మించేందుకు సహకారం అందించాలన్నారు. కళాశాల విద్యార్థుల్లో ఏమైనా మార్పులు వస్తున్నాయంటే వారి వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి గుర్తించాలన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు.
పెడదోవ పట్టకుండా చూడాలి
తెలిసీ తెలియని వయస్సులో విద్యార్థులు పెడదోవ పట్టకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేయాలన్నారు. కొందరు ఇలాంటి వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై డేగ కన్ను వేశామన్నారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశామని, ఇంకా ఎక్కడైనా అమ్మకాలు చేస్తున్నారని తెలిసినా తమకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మత్తుకు దూరంగా ఉండాలని సూచన
విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన వైనం


