చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరం కందవారపేటెలో నరసింహమూర్తి అనే వ్యక్తి ఇంటిలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు పుష్పలత(29) అనే వివాహిత గొంతు కోసి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. అయితే పుష్పలత తల్లి మాత్రం తన కూతురును ఎవరో చంపలేదు. ఆమె భర్త తరపు వారే హత్య చేశారని, మంగళసూత్రం కోసం కాదు భర్త తరపు వారే పథకం ప్రకారం ఎవరికో సుపారీ ఇచ్చి హత్య చేయించారని ఆరోపించారు. పుష్పలతకు సంతానం కలుగక పోవడంతో రెండు ఇళ్లలో గొడవలు జరుగుతుండేవని స్థానికులు పేర్కొన్నారు. బెంగళూరు చుంచనగట్టకు చెందిన మహేశ్, లక్ష్మిల కుమార్తె పుష్పలతకు చిక్కబళ్లాపుర కందవారపేటెఉక చెందిన నరసింహమూర్తి, విజయలక్ష్మిల కుమారుడు భరత్‌తో నాలుగేళ్ల క్రితం పెళ్లి అయింది. ప్రస్తుతం పుష్పలత, భరత్ వేరే ఇంటిలో నివాసం ఉన్నారు. భరత్ కుటుంబీకులు కేరళలోని ఆలయానికి వెళ్లారు. ఇంటిలో తన మరదలు భవ్యతో కలిసి నిద్రించగా రాత్రి సమయంలో దుండగులు వచ్చి పుష్పలత గొంతు కోసి గొలుసు లాక్కొని పరారయ్యారు. స్థలానికి నగర పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ముంచెత్తిన వర్షం
బనశంకరి: రాష్ట్రంలో ముంగారువర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రానున్న ఐదురోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులు, గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం సాయంత్రం బెంగళూరు నగరంలో భారీ వర్షం కురిసింది. మెజస్టిక్, కార్పొరేషన్, కేఆర్.మార్కెట్, యుబీ.సిటి, రిచ్మండ్‌సర్కిల్, శివానందసర్కిల్, జయనగర, మల్లేశ్వరం, యశవంతపుర. యలహంక, హెబ్బాళ, ఆర్‌టీ.నగర, మహాలక్ష్మీలేఔట్, విజయనగర, బనశంకరి, నాయండహళ్లి, కోరమంగల, శాంతినగర, విద్యారణ్యపుర. మాగడి, సహకారనగర, దాసరహళ్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.దీంతో విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్తున్న ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. శివానంద సర్కిల్‌లోని రైల్వేఅండర్‌పాస్‌లో జలావృతం కాగా కారు చిక్కుకుంది. అనేక చోట్ల రోడ్లు నదులను తలపించాయి. కరావళి జిల్లాల్లో జూన్ 2 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తూ ఎల్లోఅలర్ట్ ప్రకటించింది. మత్య్సకారులు చేపలవేటకు వెళ్లరాదని సూచించింది.


